కోర్టులో కాకాణి ఫైల్స్ చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్.. సీబీఐ విచారణకు లాయర్ల డిమాండ్
Publish Date:Apr 16, 2022
Advertisement
న్యాయం జరగాల్సిన కోర్టు నుంచే సాక్షాలు మాయం అవుతే? కోర్టులో దొంగలు పడితే? అందులోనూ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కేసుకు సంబంధించిన ఫైల్స్ మాత్రమే దొంగిలించబడితే? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? కీలకమైన కేసులో.. కాకాణి మంత్రి అయిన కొన్ని రోజుల్లో.. ఇలా కోర్టులో దొంగతనం జరగడం మామూలు విషయం కానేకాదు. మంత్రికి ఆ కేసులో శిక్ష పడకుండా.. సాక్షాలు మాయం చేయడానికే దొంగలు తెగించారని తెలిసిపోతోంది. ఇందులో రాజకీయ కోణం పక్కాగా కనిపిస్తోంది. ఇలా కోర్టులపైనే దాడులు జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇలాగైతే.. ఇక న్యాయస్థానంలో న్యాయమనేదే ఉండదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకే ఈ దొంగతనం కేసు హైకోర్టు పర్యవేక్షణలో జరగాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. దీని వెనుక వైసీపీ వారి హస్తం ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది. మరోవైపు, సీసీఫూటేజీ ఆధారంగా ఐదుగురు అనుమానితులను గుర్తించారు పోలీసులు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇక, నెల్లూరు కోర్టు భవనాల సముదాయం దగ్గర న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయ వ్యవస్థను కాపాడాలంటూ నినాదాలు చేశారు. దొంగలబారి నుంచి న్యాయస్థానాన్ని రక్షించాలని కోరారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. "అనామక దొంగలను అరెస్టు చేయడం కాదు. చోరీకి పాల్పడిన అసలు దొంగలను అరెస్టు చేయాలి. కాకాణి ముద్దాయిగా ఉన్న కేసు ప్రాపర్టీ చోరీకి గురైంది. వందల కేసులు ఉండగా ఈ ఒక్క కేసు పత్రాలే ఎందుకు దొంగిలించారు. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి. భారతదేశ చరిత్రలో ఇలాంటి చోరీ జరగలేదు. కేసు పత్రాలు దొంగిలించడం దుర్మార్గమైన చర్య. కోర్టులోనే చోరీ జరిగితే.. ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలి" అని న్యాయవాదులు ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/updates-on-nellore-court-theft-case-25-134480.html





