కారుకి, కాషాయానికి మధ్య వార్ స్టార్టైనట్టేనా?
Publish Date:Jul 29, 2017
Advertisement
కేసీఆర్ ఈ మధ్య దిల్లీ వెళ్లి వచ్చారు. ప్రధానమైన అసెంబ్లీ సీట్ల పెంపుపై ఓ క్లియర్ ఐడియా వచ్చేసింది. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఇప్పుడప్పుడే లేదని తేలిపోయింది. కాని, ఈ పరిణామంపై మోదీతో భేటీ తరువాత కేసీఆర్ పెద్దగా అసంతృప్తి ఏం ప్రకటించలేదు. సాదాసీదాగా హైద్రాబాద్ వచ్చేశారు. కాని, తరువాతే రెండు గుర్తించదగ్గవి జరిగాయి! ఒకటి… పాతబస్తీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన రాజా సింగ్ మీద చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పేసింది! ఆయనెప్పుడో 2013లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ… వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్కార్ పోలీస్ లకు పర్మిషన్ ఇచ్చింది! ఇక రెండోది… ఓవైసీ ఓ కామెంట్ చేశారు! కేసీఆర్ వున్నంత వరకూ బీజేపి తెలంగాణలో అధికారం చేపట్టలేదని అర్థం వచ్చేలా మాట్లాడారు! బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ మీద చర్యలు, ఓవైసీ కేసీఆర్ మీద విశ్వాసం ప్రకటించటం… ఒక దానితో ఒకటి లింక్ వున్నవి కాకపోవచ్చు! కాని, మొత్తం మీద ఒకటి మాత్రం అర్తం చేసుకోవచ్చు. ఇంత కాలం కేసీఆర్ కమలదళాన్ని టార్గెట్ చేయలేదనే చెప్పాలి. అప్పుడో ఇప్పుడో కామెంట్లు చేసినా టీఆర్ఎస్, బీజేపీల మధ్య పచ్చ గడ్డి భగ్గుమనే పరిస్థితులు రాలేదు. కాని, 2019ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వారంతా టీఆర్ఎస్, బీజేపిల నడుమ సాగుతుందా అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది. ఎందుకంటే, కేసీఆర్ సర్కార్ రాజాసింగ్ పైన చర్యలు తీసుకుంటే అది దుమారం రేపే అవకాశాలే వున్నాయి. రాజా సింగ్ కు హిందూ ఫైర్ బ్రాండ్ గా, ఓవైసీలతో పోరాడే హిందూత్వ నాయకుడిగా ఓ మోస్తరు గుర్తింపు వుంది. అది రేపో మాపో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తే మరింత పెద్దదవుతుంది. బీజేపికి కూడా ఇప్పుడు ఇలాంటి అంశమే కావాలి! అసదుద్దీన్ ఓవైసీ బీజేపిని తాను ఎదుర్కొంటానని అనకుండా… కేసీఆర్ వున్నంత వరకూ అంటూ భరోసా ప్రకటించటం… ముందు ముందు వారి కో ఆపరేషన్ని చెప్పకనే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారికంగా ఎంఐఎం కార్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపి వారికి అంతకంటే కావాల్సింది ఇంకేం వుండదు. ఆ కలయికనే బూచిగా చూపి ప్రచారం హోరెత్తిస్తారు. టీఆర్ఎస్, బీజేపి ఎదురెదురు తలపడితే ముందుగా అలెర్ట్ కావాల్సింది తెలంగాణ కాంగ్రెస్! ఎందుకంటే, చాలా మంది రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం టీఆర్ఎస్, కేసీఆర్ లకు జనంలో ఇంకా గట్టి ఫాలోయింగే వుంది. ఎటోచ్చి… చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు తెలంగాణలో కూడా… బీజేపి వేడి కాంగ్రెస్ కు తగలచ్చు. ఎన్నికల ముందు ఇప్పుడు గుజరాత్ లో జరుగుతోన్నట్టు ఊహించని వలసలు ఇక్కడ కూడా వుంటే అది హస్తానికి పెద్ద ప్రమాదం. బీజేపి వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టకపోయినా… ప్రధాన ప్రతిపక్షం అయినా బోలెడు లాభం పొందినట్టే!
http://www.teluguone.com/news/content/trs-45-76654.html





