మీ బంధాన్ని బలపరిచే సూత్రాలేంటో తెలుసా?
Publish Date:Dec 12, 2023

Advertisement
కోటిఆశలతో కొత్త జీవితంలోకి అడుగేస్తాం. మరి ఆ వైవాహిక జీవితం కలకాలం సంతోషంగా ఉండాలంటే మొదట్లోనే ధ్రుడమైన పునాదులు నిర్మించుకోవడం చాలా అవసరం. అందుకు ఈ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి.
అప్యాయత, అనురాగం ఉండాలి:
ప్రేమ, ఆప్యాయతలను భాగస్వామిపై చూపించడం చాలా ముఖ్యం. కొందరు ప్రతిదానికి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. అలాచేయడం మనకు నచ్చినా మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. చూసే వారికీ అది ఏదోలా ఎగతాళిగా ఉంటుంది. అందుకే ఇద్దరికీ నచ్చేట్లుగా మీ ఆనందక్షణాలను మీ మధ్యే ఉండేవిధంగా చూసుకోవాలి. అంతేకానీ నలుగురి మెప్పుకోసం ప్రయత్నాలు చేయకూడదు.
తొందరపాటు మంచిది కాదు:
మొదట్లో మీకు సంబంధించి కొన్ని విషయాలను చెప్పేయాలని, లేదా భాగస్వామికి సంబంధించిన విషయాలన్నీ మీరు తెలసుకోవాలన్న కుతూహలం చూపించకూడదు. సహజంగానే ఆ బంధాన్ని వికసించేలా చేయండి. భాగస్వామి నిజంగా తన విషయాలను మనతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడే వినండి. కానీ చెప్పమని బలవంతం చేయకూడదు. ఆ మాత్రం రహస్యం ఉంటేనే..బంధం మనోహరంగా సాగుతుంది. పెళ్లికి ముందు మాటల్లోనే లేదా పెళ్లైన కొత్తల్లో కొందు భాగస్వామిని ఇంప్రెస్ చేసేందుకు ఏవేవో వాగ్దానాలు చేస్తుంటారు. తీరా వాటిని నిలబెట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలా చేయడం వల్ల భాగస్వామికి మన మీద అపనమ్మకం ఏర్పడుతుంది. అందుకే కచ్చితంగా మాట నిలబెట్టుకోగలం అనుకుంటేనే వాగ్దానాలు చేయండి.
స్వేచ్చనివ్వండి:
ప్రతినిమిషం భాగస్వామితోనే కలిసి సమయం గడపాలనుకోవడం సహజం. మరీ ముఖ్యంగా పెళ్లైన కొత్తలో అలాని వారికంటూ వ్యక్తిగత స్వేచ్ఛ, సమయం ఇవ్వకుండా ఉండటం సమంజసం కాదు. వాళ్లకూ స్నేహితులూ, ఆసక్తులూ, లక్ష్యాలు ఉంటాయి. వారు వ్యక్తిగతంగా ఎదిగితేనే కదా మన బంధమూ కూడా బలంగా ఉండేది.
http://www.teluguone.com/news/content/tips-for-keeping-your-relationship-strong-and-healthy-35-166861.html












