ఈ కేసులు టికెట్ లేకుండా చూపిస్తున్న సినిమాలే.. సీపీఐ నారాయణ
Publish Date:Apr 13, 2026
Advertisement
ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సీపీఐ నారాయణ ఏ విషయం మీదనైనా సరే ఎలాంటి బేషజాలూ లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. అటువంటి నారాయణ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులపై నడుస్తున్న కేసులపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సివిల్ సర్వెంట్స్ రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారన్న నారాయణ, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, రిటైర్మెంట్ తర్వాత కార్పొరేట్ సంస్థల్లో పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. మీ పదవి ఎక్కడికీ పోదు, జీతం తగ్గదు.. మరి తప్పు చేయమని అడిగినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేకపోతున్నారు?" అని సూటిగా ప్రశ్నించారు. ఇకఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నకు అది చంద్రబాబు అత్యుత్సాహం అని అన్నారు. గతంలో ఆయన అత్యుత్సాహం వల్లే అమరావతి నిర్మాణంలో సమయం వృధా అయ్యిందన్నారు. రైతుల దగ్గర భూములు తీసుకోవడం చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమైందని, కానీ వేల ఎకరాల భూమిని ఒకేసారి అభివృద్ధి చేయాలనుకోవడం వల్ల అప్పట్లో జాప్యం జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధిని దెబ్బతీయకుండా అభివృద్ధి జరగాలని, కేవలం భవనాలు కడితే సరిపోదని సూచించారు. గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తన నెగటివ్ పాలిటిక్స్ ద్వారా చంద్రబాబు గెలుపునకు ఎలా సహకరించారో, చంద్రబాబు ప్రజల సమస్యలను విస్మరిస్తే ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో అదే పరిస్థితి ఎదురౌతుందన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత అధికారులపై కక్షసాధింపు చర్యలు అన్నది ఒక ఆచారంగా మారిందన్న నారాయణ.. ఈ వైఖరి వ్యవస్థకు చేటు చేస్తుందని హెచ్చరించారు. అమరావతి రాజధానిని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టబద్ధం చేయడం మంచిదే అయినా.. ప్రజల్లో ఉన్న ఇన్సెక్యూరిటీని తొలగించి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించడంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. జగన్ మావిగన్ ను పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు.
సీపీఐ సీనియర్ నాయకుడు డాక్టర్ కె. నారాయణ తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తినెయ్యి వినియోగం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అవినీతి, అక్రమాలు తదితర కేసులలో ఎవరికీ శిక్ష పడే అవకాశం లేదని విస్పష్టంగా చెప్పారు.
రెండు రాష్ట్రాల్లోనూ కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు ముమ్మరమయ్యాయి. ఏపీలో మద్యం కుంభకోణం, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, ఇక తెలంగాణలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ తదితర కేసుల విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులు ఎక్కడి వరకు వెళ్తాయి? రాజకీయ నాయకులకు శిక్షలు పడతాయా? అన్న తెలుగువన్ ప్రశ్నకు నారాయణ ఒకరి మీద ఒకరు రాళ్లు వేసుకోవడం తప్ప, ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల సహకారంతో సాగే ఈ వ్యవహారాల్లో అసలైన దోషులకు శిక్షలు పడటం అసాధ్యమని కుండబద్దలు కొట్టేశారు.
http://www.teluguone.com/news/content/these-cases-are-merely-movies-being-screened-without-tickets-39-217257.html





