శత్రువు ఇబ్బంది పెడితే ఏం చేయాలి? చాణక్యుడు ఏం చెప్పాడంటే..!
Publish Date:Mar 31, 2025

Advertisement
ఆచార్య చాణక్యుడు గొప్ప నీతి శాస్త్రజ్ఞుడు. ఆయన చెప్పిన నీతి శాస్త్ర విషయాలు ఇప్పటికీ ఆచరించదగినవి. నీతి శాస్త్రంలో జీవితంలో అన్ని విషయాలకు పరిష్కారాన్ని అందించడం ఆచార్య చాణక్యుడికే చెల్లింది. చాణక్యుడు విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు. ఆచార్య చాణక్యుడు రాసిన చాణక్య నీతిని ఇప్పటికీ ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు. చాలావరకు శత్రువులు వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలా ఇబ్బంది పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవాలని ఉన్నా ఎలా తప్పించుకోవాలో చాలా మందికి తెలియదు.
ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలకు ప్రధాన కారణం శత్రువు. ముఖ్యంగా సంతోషంగా ఉంటూ జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వారి జీవితంలో వారిని ఇబ్బంది పెట్టడానికి శత్రువు ప్రవేశిస్తాడు. ఎంతలా ఎన్ని కారణాలుగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెడతాడు కూడా. అయితే ఇలా ఇబ్బందులు పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆచార్య చాణక్యుడి నీతిని పాటించడం సరైన పరిష్కారంగా పనిచేస్తుంది.
శత్రువు వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటే మొదట చేయాల్సిన పని శత్రువు గురించి తెలుసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. శత్రువు ఎవరైనా సరే.. ఆ శత్రువు బలవంతుడా లేదా బలహీనుడా అనే విషయం తెలుసుకోవాలి. ఆ శత్రువు బలం, బలహీనత ఆధారంగా ఒక వ్యూహం రచించాలి. ఆ వ్యూహాన్ని అనుసరించే ముందడుగు వేయాలి. అలా చేస్తే శత్రువు మీద విజయం సాధించగలుగుతారు. అయితే శత్రువు మీద విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. అవేంటో తెలుసుకుంటే.
సహనం, సంయమనం..
చాలా సార్లు ప్రజలు కోపంగా ఉండి తమ శత్రువుపై నేరుగా దాడి చేస్తారు. కానీ చాణక్యుడి ప్రకారం శత్రువును ఓడించడానికి సంయమనం, సహనం అవసరం. పరిస్థితి ఏమైనప్పటికీ, ఓర్పు, సంయమనం పాటించాలి. సరైన సమయంలో తదుపరి అడుగును ఆలోచనాత్మకంగా తీసుకోవాలి.
శత్రువును అయోమయంలో ఉంచాలి..
శత్రువును ఎప్పుడూ అయోమయంలో ఉంచాలి అని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే శత్రువుకు మీ ప్రణాళికలు, ఉద్దేశాల గురించి తెలిస్తే వారు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతారు. కాబట్టి వారికి తగిన బుద్ధి చెప్తూనే ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/the-secret-to-overcoming-the-enemy-35-195298.html












