ఆధిపత్యం.. మంత్రి టూ ఎమ్మెల్యే వయా ఎంపీ
Publish Date:Jun 25, 2016
Advertisement
ఖమ్మం జిల్లా అంటే టక్కున గుర్తొచ్చేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..టీడీపీలో ఉన్నా టీఆర్ఎస్‌లో ఉన్నా జిల్లాలో ఆయన చెప్పిందే శాసనం. నిన్నటి వరకు సింగిల్ హ్యాండ్‌తో ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పిన తుమ్మలకు ఇప్పుడు పోటీ ఎదురైంది. అది కూడా సొంతపార్టీ నేతల నుంచే. 2014 సాధారణ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున తుమ్మల, కాంగ్రెస్ తరపున పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేసి..నాగేశ్వరరావుపై అనూహ్యంగా గెలుపోందారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్..తన చిరకాల మిత్రుడు తుమ్మలను టీఆర్ఎస్‌లోకి చేర్చుకుని మంత్రిని చేశారు. అప్పటి నుంచి జిల్లాలో వార్ వన్ సైడ్ అయ్యింది. ఈ మధ్యలో పువ్వాడ, తుమ్మల అనేక సందర్భాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా పువ్వాడ గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరికి కోల్డ్ వార్ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రి ఆధిపత్యాన్ని ఎమ్మెల్యే..ఎమ్మెల్యే పెత్తనాన్ని మంత్రి సహించుకోలేకపోతున్నారు. తుమ్మల ప్రమేయం లేకుండా ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పువ్వాడ శంకుస్థాపన చేయడం..మంత్రి ప్రత్యేక చోరవతో చేపట్టిన గోళ్లపాడు ఛానల్ ప్రక్షాళన పనులను ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించడం తుమ్మలకు ఆగ్రహాన్ని తెప్పించింది. సీఎం కేసీఆర్ తుమ్మలకు..కేటీఆర్ పువ్వాడకు అండదండలు అందిస్తుండటంతో జిల్లాలో ఏ పని జరగాలన్నా ముందు వీరిద్దరిని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుందని నేతలు వీరి ఇంటి ముందు క్యూలు కడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నామినేటేడ్ పోస్టుల భర్తీ తెరపైకి వచ్చింది. దీంతో పార్టీలోని ఆశావహులంతా మంత్రి, ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వీరిద్దరూ ఈ పదవులు తమ వర్గీయులకు దక్కాలంటే..కాదు తమకే దక్కాలని అడ్డుపడుతూ క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్యలోకి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి చేరారు. తమ వర్గీయులకు నామినేటేడ్ పదవులు కావాలని ఎంపీ సీఎం స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమస్యను టీఆర్ఎస్ అధినేత ఎలా పరిష్కరిస్తారో..?
http://www.teluguone.com/news/content/telangana-rashtra-samithi-45-62925.html





