తెలంగాణ పోలీసుల ఆరోగ్య భద్రత పథకం రద్దు.. ఎందుకంటే?
Publish Date:Jul 1, 2026
Advertisement
తెలంగాణ పోలీసు సిబ్బందికి దశాబ్దాలుగా కొండంత అండగా నిలిచిన ఆరోగ్య భద్రత నగదు రహిత వైద్య చికిత్స పథకం రద్దైంది. బుధవారం (జులై1 )నుంచి ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు డిజిపి, ఆరోగ్య భద్రత పథకం చైర్మన్ అయిన సీవీ ఆనంద్ సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్తగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడమే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త విధానం ప్రకారం, జూన్ నెలకు సంబంధించిన జీతాల నుండి ఉద్యోగుల బేసిక్ పే, పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుండి 1.5 శాతం చందాను రికవరీ చేయాలని ప్రభుత్వం జీవో 79 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా, జూలై 1న చెల్లించే జూన్ జీతాల నుండి పాత ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించిన నెలవారీ చందా వసూళ్లను నిలిపివేశారు. గత కొంతకాలంగా ఆరోగ్య భద్రత పథకం నిధుల కొరతతో సతమతమౌతోంది. ఈ పథకం కింద ప్రతి నెలా దాదాపు 3వేల వైద్య బిల్లులు వస్తుండటంతో.. పాత నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి ఎలాంటి అదనపు రీఇంబర్స్‌మెంట్లు వచ్చే అవకాశం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే, నెట్‌వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30, అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కొత్త ఇహెచ్‌సిటి విధానంలో ఉద్యోగుల నుండి వసూలు చేసే 1.5 శాతం చందా మొత్తాన్ని వైద్య, ప్రజారోగ్య అవసరాల కోసం కేటాయించిన ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. ఒకే కుటుంబంలో డూప్లికేషన్ లేదా ఒకే వ్యక్తి నుండి రెండుసార్లు చందాలు కట్ కాకుండా ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలను విధించింది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా, లేదా ఒకరు ఉద్యోగి అయి మరొకరు పెన్షనర్ అయినా, లేక ఒకే పెన్షనర్ సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్లు రెండూ పొందుతున్నా... కేవలం ఒక్కరి నుండి మాత్రమే ఈ చందా సేకరిస్తారు. 1999లో ప్రారంభమై, పోలీస్ శాఖలో అత్యంత ఆదరణ పొందిన ఈ క్యాష్‌లెస్ హెల్త్‌కార్డ్ వ్యవస్థ రద్దు కావడం పట్ల పోలీసు సిబ్బందిలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/telangana-police-health-security-scheme-scrapped-36-224723.html





