కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ వేటుకు సిఫారసు..!
Publish Date:Aug 25, 2026
Advertisement
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి మరికాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలవనున్నారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిన నివేదికలోని అంశాలు, చర్యలకు గల కారణాలను సీఎం దృష్టికి మల్లు రవి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ తమ నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించారు. మంత్రి కొండా సురేఖ విషయంలో గతంలో హెచ్చరికలు చేసినప్పటికీ ఆమె వైఖరిలో మార్పు రాలేదని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని, కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అత్యంత కీలకమని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అదేవిధంగా చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ సిఫారసులపై సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. Telangana Congress, Konda Surekha, Chinna Reddy, CM Revanth Reddy, MP Mallu Ravi,
Telangana Politics,TPCC, Mahesh Kumar Goud
http://www.teluguone.com/news/content/telangana-congress-39-229839.html





