తెలంగాణ సంస్కృతి: విమానాశ్రయాల డిజైన్లపై సీఎం రేవంత్ కీలక సూచనలు..!
Publish Date:Sep 22, 2026
Advertisement
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయాల శిల్ప, వాస్తు కళలను పరిశీలించి, వాటి స్ఫూర్తి ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయాల నిర్మాణ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్రవాహాల మళ్లింపు, రహదారుల మార్పు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగునీటి సరఫరా లైన్ల మార్పు తదితర అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం.. పనులను సమన్వయంతో చేపట్టాలని అధికారులకు సూచించారు. విమానాశ్రయాల కాంపౌండ్ వాల్‌కు సమీపంగా రహదారులను నిర్మించి, వాటిని జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఒక్కో శాఖ విడివిడిగా పనులు చేపడితే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్, ఆర్‌అండ్‌బీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో సమావేశమై.. బీఎస్ఎన్ఎల్ అధికారులతోనూ చర్చించాలని సీఎం సూచించారు. అన్ని పనులను ఏకకాలంలో చేపట్టేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రణాళికతో పనులు ముందుకు సాగాలని స్పష్టం చేశారు. వాగులు, ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సి వస్తే.. విమానాశ్రయ ప్రాంగణంలో లేదా సమీప ప్రాంతాల్లో చెరువులు నిర్మించి, అక్కడి నుంచి నీటి ప్రవాహాలను మళ్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విమానాశ్రయాలకు రాకపోకలు సాగించే రహదారులు విశాలంగా ఉండటంతో పాటు, సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానమయ్యేలా నిర్మించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలతో పాటు ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను కూడా సీఎం పరిశీలించారు. ప్రతి నిర్మాణంలో తెలంగాణ సంస్కృతి, శిల్ప, వాస్తు కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డిజైన్లలో పలు మార్పులను సూచించిన సీఎం.. తెలంగాణ చరిత్ర, వారసత్వం ప్రతిబింబించేలా నిర్మాణాలు ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి గంగాధర్, పవర్ గ్రిడ్ ఈడీ డొమన్ యాదవ్, టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎయిర్ కమోడోర్ రాహుల్ శుక్లా, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, స్థపతి ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. [ Telangana, Revanth Reddy, Adilabad Airport, Warangal Airport, Telangana Bhavan, Telangana Culture, Airport Development, Telangana Government, Kakatiya Architecture, Infrastructure Development ]
http://www.teluguone.com/news/content/telangana-24-232183.html




