కొండకి వెంట్రుక వేసిన టీడీపీ లీడర్ల ‘బంగారు కొండ’లు!
Publish Date:Jul 18, 2014
Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తుంటే, ఆయనకి చేదోడు వాదోడుగా నిలవాల్సిన కొందరు టీడీపీ లీడర్లు మాత్రం సందట్లో సడేమియా అని ‘నాలుగు రాళ్ళు’ వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒక కొండకి వెంట్రుక వేశారు. వస్తే కొండ... పోతే వెంట్రుక అన్నట్టుగా, ఎవరి సొమ్ము కోసమో తాపత్రయపడుతున్నారు. ఇంతకీ ఆ కొండ ఏదో మామూలు కొండ కాదు. ప్రకాశం జిల్లాలోని అత్యంత ఖరీదైన గెలాక్సీ గ్రానైట్ కొండ. ఈ మేటర్ పూర్వాపరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతం అత్యంత ఖరీదైన గెలాక్సీ గ్రానైట్ కొండలకు నిలయం. అలాంటి అనేకానేక కొండల్లో రాఘవరెడ్డి అనే ఒక వ్యాపారవేత్త కూడా కొన్ని కొండలకు సొంతదారు. ఆయనకి చెందిన ఓ పెద్ద కొండమీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ‘బంగారు కొండల’ కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిపోయి ఆ కొండను లాక్కెళ్ళడానికి వెంట్రుక వేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి ‘ఉప’ నేత అయిన కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకుడి పుత్రరత్నం, ప్రకాశం జిల్లాలో మంచి బలమున్న నాయకుడి కుమారుడు.... ఈ ఇద్దరు ‘బంగారు కొండలు’ కేంద్రంలో చక్రం తిప్పుతున్న నాయకుడి మనవడిని కలుపుకుని సదరు గ్రానైట్ కొండ మీద కన్నేశారు. ఆ కొండని సొంతం చేసుకోవడం కోసం సర్వేలంటూ, కలెక్టర్లంటూ, రికార్డులంటూ నానా హడావిడి చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొండ సొంతదారుడైన రాఘవరెడ్డి వినోదం చూస్తున్నారే తప్ప ఎంతమాత్రం టెన్షన్ పడటం లేదు. ఈ బంగారు కొండలు ఎన్ని వెంట్రుకలు వేసినా తన నుంచి గ్రానైట్ కొండని లాక్కెళ్ళలేరన్న ధీమాలో ఆయన వున్నారు. ఎందుకంటే, అగ్రనేత బావమరిది ఆయనకి కొండంత అండగా వున్నారు మరి! రాఘవరెడ్డికి ఇంత బ్యాక్‌గ్రౌండ్ వుందని తెలిసి కూడా కుర్రాళ్ళు తమ ప్రయత్నాలను మానుకోవడం లేదు. మరి వెంట్రుక గెలుస్తుందా... పెద్ద అండ వున్న కొండ గెలుస్తుందా? చూడాలి!
http://www.teluguone.com/news/content/tdp-leaders-sons-trying-to-grab-a-hill-in-prakasam-district-45-36109.html





