హర్మూజ్ గుండా సురక్షిత రవాణా కోసం అమెరికా అయిల్ కారిడార్.!
Publish Date:Aug 20, 2026
Advertisement
ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం పటిష్ఠ భద్రత కల్పించింది. చమురు రవాణాకు ఇసుమంతైనా అవరోధం కలగకుండా కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ గుండా చమురు రవాణాకు అంతరాయం లేకుండా పటిష్ఠ భద్రత కల్సిస్తూ ఒక షిప్పింగ్ కారిడార్ ను ఏర్పాటు చేసింది. గల్ఫ్ దేశాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు చమురు రవాణాను పునరుద్ధరించేందుకు అమెరికా ఈ చర్య తీసుకుంది. యుద్ధానికి ముందు ఈ జలసంధి గుండా వెళ్లే చమురు పరిమాణంతో పోలిస్తే..ఇప్పుడు అమెరికా పర్యవేక్షణలో సగం మేర రవాణా పున్: ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు కోటి బ్యారెళ్ల చమురు హర్మూజ్ ద్వారా సురక్షితంగా రవాణా అవుతోంది. పరిస్థితి మరింత అనుకూలిస్తే రాబోయే కొద్ది రోజుల్లో ఈ సరఫరా రోజుకు రెండు కోట్ల బ్యారెళ్లకు పెరుగుతుందని అంచనా. ఇరాన్ నుంచి పొంచి ఉన్న డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల ముప్పును తిప్పికొడుతూ వాణిజ్య నౌకలను సురక్షితంగా దాటించడం కోసం అమెరికా యుద్ధ విమానాలు నిరంతరం ఆకాశంలో మోహరించి, చమురు ట్యాంకర్లకు భద్రత కల్పిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్.. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ 15 నుండి 20 బారీ ఆయిల్ ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. హర్మూజ్ ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలు, సముద్ర నిఘా నెట్‌వర్క్‌లను అమెరికా సైన్యం దెబ్బతీయడంతో ఈ నౌకల కదలికల సమన్వయం సులభతరమైంది. ప్రపంచ మార్కెట్లో చమురు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకకుండా చూడటంలో ఈ ఆయిల్ కారిడార్ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇరాన్ క్షిపణి దాడుల భయం ఇంకా పూర్తిగా తొలగిపోకపోవడంతో ఈ మార్గంలో ప్రతి చమురు ట్యాంకర్ ప్రయాణం ఇప్పటికీ ప్రమాదంగానే ఉంది. Strait of Hormuz, US Oil Corridor, Gulf Oil Supply, Fort Bragg Task Force, Iran Conflict, Oil Tanker Security
http://www.teluguone.com/news/content/strait-of-hormuz-36-229358.html





