కర్నాటక సీఎంపై స్టింగ్ ఆపరేషన్.. డీకే సంచలన వ్యాఖ్యలు.. అత్యాధునిక సాంకేతికతతో ప్రయత్నం.!
Publish Date:Oct 23, 2026
Advertisement
కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సరికొత్త అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు తనను రహస్యంగా రికార్డ్ చేసేందుకు కుట్ర పన్నారంటూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. మెటా సంస్థకు చెందిన స్మార్ట్ గ్లాసెస్‌ను ధరించి తనను కలిసిన ఆ పారిశ్రామిక వేత్త.. సంభాషణ మొత్తాన్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడని డీకే పేర్కొన్నారు. అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తనను కలిసేందుకు అధికారికంగా అపాయింట్మెంట్ తీసుకున్న ఆ పారిశ్రామికవేత్త, మొదట సాధారణ వ్యాపార విషయాలపై చర్చలు ప్రారంభించి, ఆ తరువాత రాజకీయ విషయాలు, బూత్ స్థాయి వ్యూహాలు, సున్నితమైన అంశాల వైపు చర్చను మళ్లించినట్లు తెలిపారు. ఆ సమయంలో అతడు ధరించిన ప్రత్యేక కళ్లద్దాలపై అనుమానం కలగడంతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై అనుమానం బలపడటంతో సదరు పారిశ్రామికవేత్త నేపథ్యంపై నిఘా పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు డీకే శివకుమార్ చెప్పారు. కేవలం తనను మాత్రమే కాకుండా, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీషన్‌తో సమావేశమైనప్పుడు కూడా సదరు వ్యక్తి ఇదే రకమైన మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి పాల్గొన్నట్లు తమ విచారణలో తేలిందని వెల్లడించారు. అయితే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాల్లో మాత్రం అతను ఈ కళ్లద్దాలను ఉపయోగించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మొత్తంగా ఇటీవల కాలంలో కర్ణాటక రాజకీయాల్లో వరుసగా వెలుగుచూస్తున్న స్టింగ్ ఆపరేషన్ ఉదంతాలు దుమారం రేపుతున్నాయి. కొద్ది రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడిపడి ఉన్నట్లు చెబుతున్న ఒక రహస్య వీడియో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ వీడియోను ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు, నాయకుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులను లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇటువంటి స్టింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని కేబినెట్ మంత్రులు, అత్యున్నత స్థాయి నాయకులు, వారి వ్యక్తిగత సహాయకులు అప్రమత్తంగా ఉండాలని డీకే శివకుమార్ హెచ్చరించారు. ముఖ్యంగా టెలిఫోన్ సంభాషణలు, డిజిటల్ కమ్యూనికేషన్లు, వ్యక్తిగత భేటీల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాజకీయ ప్రత్యర్థులు తమను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు, చట్టపరమైన చిక్కుల్లో పడేసేందుకు అత్యాధునిక గాడ్జెట్లను ఉపయోగించి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఈ సాంకేతిక గూఢచర్యం, డిజిటల్ పరికరాల ముసుగులో గోప్యతను భగ్నం చేసే చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విఘాతమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Sting Operation On Karnataka CM, DK Shivakumar, Meta Smart Glasses, Karnataka Politics,Industrialist Secret Recording, Congress News, Telugu One]
http://www.teluguone.com/news/content/sting-operation-on-karnataka-cm-25-235222.html





