కాపు సామాజిక వర్గానికి పెద్దపీట..గాదె ఆక్షేపణ
Publish Date:Jan 20, 2012
Advertisement
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే తొమ్మిది మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఆక్షేపించారు. ప్రస్తుతం అధికార పార్టీలో 55 మంది శాసనసభ్యులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే వారికి తగిన న్యాయం జరుగలేదన్నారు. అయితే, కాపు సామాజిక వర్గానికి 19 మంది సభ్యులు ఉంటే వారికి తొమ్మిది మంత్రి పదవులు కట్టబెట్టడం సరైంది కాదన్నారు. మంత్రి పదవుల కేటాయింపులో సాధారణ నిష్పత్తులకు విరుద్ధంగా తొమ్మిది మంత్రి పదవులను కాపు సామాజికవర్గానికి కేటాయించడం సముచితంగా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో సీఎం పదవిని ఆశించే వారు ప్రస్తుతానికి ఐదుగురు ఉన్నారని, ఈ సంఖ్య ఇంకా పెరుగుతున్నదని, దీనివల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతానికి మరో నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం సబబుగా ఉంటుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే జోడు పదవుల్లో కొనసాగుతుండగా, మరో రెండు పదవులు ఆయన కుటుంబసభ్యులకు ఉన్నాయన్నారు. ఒకే కుటుంబంలో నాలుగు పదవులు ఉండడం కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయానికి విరుద్ధం కాదా అని గాదె ప్రశ్నించారు. కాగా వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో నాడు 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, నేడు కేవలం 16 మంది మాత్రమే మిగలడాన్ని బట్టి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
http://www.teluguone.com/news/content/state-cabinet-24-11057.html





