వారణాసి సేవా సంకల్ప్ అభియాన్ లో ఏపీ సీఎం చంద్రబాబు.!
Publish Date:Sep 17, 2026
Advertisement
భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు మరియు ఆయన ప్రజా జీవితంలో అప్రతిహతంగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న సేవా సంకల్ప అభియాన్ లో తొలి రోజు గురువారం (సెప్టెంబర్ 17) ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు కొనసాగే సేవ మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం కాశీ నగరంలో గురువారం (సెప్టెంబర్ 17) శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్నగర్ నుండి వారణాసి వరకు అలాగే వారణాసి నుండి వడ్నగర్ వరకు రెండు భారీ బైక్ ర్యాలీలను అగ్రనేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలు 10 రాష్ట్రాల గుండా ప్రయాణించి, 193 జిల్లాలు మరియు దాదాపు 1,159 గ్రాగాలను తాకుతూ అక్టోబర్ 7న ముగియనున్నాయి. ఈ బృహత్తర బైక్ ర్యాలీలు మొత్తం 40,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుండగా, ఇందులో వెయ్యి మంది భాగస్వాములు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి బయలుదేరి వారణాసి చేరుకున్నారు. అక్కడ తొలుత ప్రసిద్ధ శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రుద్రాక్ష ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సేవా యాత్ర ప్రారంభ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఇదే సమయంలో గుజరాత్‌లోని వడ్నగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తదితరులు వ్యతిరేక దిశ నుంచి సాగే బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ యాత్రల ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడంతో పాటు, ప్రజా భాగస్వామ్యం, సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను చాటిచెప్పాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్‌లో పవిత్ర జలాలతో జలాభిషేకం చేసేందుకు దేశంలోని వివిధ నదుల నుండి నీటిని సేకరించి ఈ యాత్ర ద్వారా తరలిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, అట్టడుగు స్థాయి లబ్ధిదారుల సన్మానం, వికసిత్ భారత్-2047 లక్ష్యంగా పలు యువజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై, దేశ ప్రధాని స్థాయి వరకు సాగిన మోదీ పరిపాలనా ప్రస్థానాన్ని, సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. [Seva Sankalp Abhiyan, PM Modi birthday, Chandrababu Naidu Varanasi, Yogi Adityanath, Vadnagar Varanasi bike rally, NDA leaders Varanasi, Telugu One]
http://www.teluguone.com/news/content/seva-sankalp-abhiyan-39-231713.html





