విలేఖరిపై ఘరానా అల్లుడు గారి దౌర్జన్యం
Publish Date:Nov 2, 2014
Advertisement
ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో యువరాజు రాహుల్ గాంధీ గారి హవా నడిచేది. ఎక్కడ చూసినా ఆయన నామస్మరణే వినిపించేది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలోకి బావగారు రాబర్ట్ వాద్రా వచ్చేసినట్లు కనబడుతోంది. అంటే ఆయనేదో కాంగ్రెస్ పార్టీ బాధ్యత చేపడతారని కాదు గానీ హర్యానా రాష్ట్రంలో ఆయనగారి భూభాగోతాల కారణంగా ఇప్పుడు నిత్యం ఆయన పేరు మీడియాలో కనబడుతోంది. ఇంతవరకు ఆయనకు అండగా నిలబడిన హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా స్థానంలోకి ఇప్పుడు బీజేపీకి చెందిన మనోహర్ లాల్ కత్తార్ రావడంతో ఘరానా అల్లుడిగారు పేరు మరింత మారు మ్రోగిపోతోంది. ఎందుకంటే హర్యానాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అల్లుడిగారి భూ భాగోతాల మీద విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. నిన్న ఘరానా అల్లుడుగారు డిల్లీలో ఒక స్టార్ హోటల్ కి వచ్చినప్పుడు అదే విషయంపై ఆయన స్పందన తెలుసుకోవడానికి వెళ్ళిన విలేఖరిని “నన్ను ఆ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? అని గద్దించారు. అయినా ఆ విలేఖరి నక్షత్రకుడిలా వదలకుండా ఆయన వెంట పడటంతో అల్లుడుగారికి మా చెడ్డ చిరాకు వచ్చేసినట్లుంది. దానితో ఆయన కోపంగా అతని చేతిలో ఉన్న మైకును పక్కకు నెట్టేసి “ఆర్ యూ సీరియస్...ఆర్ యూ సీరియస్....ఆర్ యూ సీరియస్... ఆర్ యూ సీరియస్?” అంటూ నాలుగు సార్లు గట్టిగా అరిచేసరికి పాపం ఆ విలేఖరి బిక్క మొహం వేయక తప్పలేదు. అయితే ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం కొసమెరుపు. ఎందువలన అంటే ఇది జరగగానే "అల్లుడుగారు అమ్మగారి కుటుంబంతో ఉన్న బంధుత్వం వలన రాజ్యాంగేతర శక్తిలా తయారవుతున్నారని, ఆయనపై సదరు విలేఖరి పిర్యాదు చేసినట్లయితే చర్యలు తీసుకొంటామని" కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని అల్లుడుగారి సంగతి ఆయన అత్తగారో లేదా శ్రీమతిగారో ఎవరో ఒకరు చూసుకొంటారని కాంగ్రెస్ పెద్దలు భావించారో ఏమో.. ఈ వ్యవహారంతో తమా పార్టీకి సంబంధం లేదని ప్రకటించి చేతులు దులుపుకొన్నట్లు సమాచారం. అందువల్ల ఘరానా అల్లుడు గారిని కాపాడుకోవడానికి అత్తగారో లేక ఆయన శ్రీమతిగారో కొంగు బిగించకతప్పదేమో.
http://www.teluguone.com/news/content/robert-vadra-45-39829.html





