సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ .. పోలీసుల కాల్పులు
Publish Date:Jun 14, 2026
Advertisement
సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ యత్నాన్నిప్రయాణీకుల ధైర్యం, పోలీసు కాల్పులు విఫలం చేశాయి. వివరాలిలా ఉన్నాయి.. చెంగల్పట్టు నుండి కాకినాడ పోర్ట్ వైపు ప్రయాణిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ లక్ష్యంగా దొంగలు దోపిడీ యత్నం చేశారు. అర్ధరాత్రిదాటిన తరువాత ఒంటిగంట సమయంలో ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి దోచుకోవాలని చూశారు. బాపట్ల, అప్పికట్ల స్టేషన్ల మధ్య ఉన్న నల్లమడ వాగు రైల్వే బ్రిడ్జిపైకి రైలు చేరుకోగానీ దుండగులు ఎస్ 3, ఎస 6 స్లీపర్ కోచ్‌లలోకి చొరబడ్డారు. అక్కడ నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికులపై దాడి చేసి, వారి మెడలోని బంగారు ఆభరణాలను బలవంతంగా తెంచుకున్నారు. అయితే, ఈ హఠాత్పరిణామంతో ఒక మహిళ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా కోచ్‌లోని ప్రయాణికులంతా లేచి దొంగలను చుట్టుముట్టేందుకు ప్రయత్నించడంతో, తీవ్ర ఆందోళనకు గురైన దుండగులు పట్టుబడతామనే భయంతో వెంటనే రైలు అలారం చైన్‌ను లాగారు. దీంతో రైలు నల్లమడ వాగు బ్రిడ్జిపైనే నిలిచిపోయింది. వెంటనే దొంగలు రైలు నుండి కిందకు దూకి చీకటిని ఆసరాగా చేసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే.. రైల్లో విధుల్లో ఉన్న రైల్వే పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది తక్షణమే స్పందించారు. పారిపోతున్న దొంగలను నిలువరిస్తూ.. లొంగిపోవాలని హెచ్చరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దాలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో దొంగలు ఆభరణాలతో సహా నల్లమడ వాగు పరిసరాల్లోని దట్టమైన చీకట్లోకి పారిపోయారు. ప్రయాణికులు సమయస్ఫూర్తితో, ధైర్యంతో కేకలు వేయడం వల్లే కోచ్‌లలోని వందలాది మంది ప్రయాణికులు దోపిడీకి గురికాకుండా ప్రాణాలతో పాటు తమ సొత్తును కాపాడుకోగలిగారు. ఈ పెను ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడ లేదు. పరారీలో ఉన్న నిందితుల కోసం రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/robbery-on-circar-express-36-222933.html





