వాళ్ళెందుకు స్పందించలేదు చెప్మా?
Publish Date:Jul 4, 2015
Advertisement
జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయిన తర్వాత తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి బహిరంగంగా మాట్లాడిన మాటలు టీఆర్ఎస్ నాయకులకు పుండు మీద కారం జల్లినట్టుగా అయింది. రేవంత్ రెడ్డికి బెయిల్ దొరకడమే టీఆర్ఎస్ నాయకులు ఊహించని, ఆశించని, సహించని విషయం. అలాంటిది కోర్టు నుంచి బయటకి వచ్చిన తర్వాత కేసీఆర్ని నానా తిట్లూ తిడుతూ రేవంత్ మాట్లాడిన తీరు సంచలనం సృష్టించింది. టీఆర్ఎస్ నాయకులు అంగీకరించకపోవచ్చుగానీ, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ తర్వాత అంతటి స్థాయిలో ప్రజాదరణ వున్న వ్యక్తిగా మారారు. ఆయన్ని అలా మార్చింది మరెవరో కాదు.. అక్షరాలా టీఆర్ఎస్ నాయకులే... అందులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారే. మరి కేసీఆర్‌కి సరిసమానమైన స్థాయిలో వున్న వ్యక్తి, కేసీఆర్ భాషతో సరిపోయే విధంగా మాట్లాడితే... దానికి స్పందించిన వ్యక్తులు మాత్రం కేసీఆర్ స్థాయి వ్యక్తులు కాదు. కనీసం పార్టీలో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వున్న కేసీఆర్ రక్తసంబంధీకులు కూడా కాదు. పార్టీలో వున్న ముగ్గురు నలుగురు నాయకులు మాత్రమే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటలు కూడా ఏదో తూతూ మంత్రంగా మాట్లాడినట్టున్నాయే తప్ప, రేవంత్ రెడ్డి విమర్శలకు దీటైన సమాధానం ఇచ్చేలా మాత్రం లేవు. ఇలాంటి సందర్భాలలో రేవంత్ రెడ్డి మీద కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి మాటకారి నాయకులు మాటల దాడికి దిగితే ఒక పద్ధతిగా వుండేది. అయితే వీళ్ళెవరూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించలేదు. ఓ సందర్భంలో సీఎం కేసీఆర్ని ఈ విషయంలో ప్రశ్నించినా ఆ పిచ్చివాడి టాపిక్ వదిలేయండి అంటూ మాట మార్చారు. మరి ‘ఆ నలుగురు’ స్పందిస్తే రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ఎదురుదాడి చేసే అవకాశం వుందని మిన్నకున్నారా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించి అతని స్థాయిని మరింత పెంచడం ఎందుకని అనుకున్నారా? అయినా రేవంత్ స్థాయిని ఇప్పుడు ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు.. ఆల్రెడీ పెరిగిపోయింది.
http://www.teluguone.com/news/content/revanth-reddy-trs-45-48053.html





