ఫెమినిస్ట్ ల వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుందా?
Publish Date:Apr 7, 2025

Advertisement
ఫెమినిస్ట్.. ఈ పదం ఎక్కడైనా కనిపించింది అంటే సమాజం దృష్టి మొత్తం అటువైపు సారిస్తుంది. ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సరే.. మహిళల వైపు వకల్తా పుచ్చుకుని మహిళల గురించి మాట్లాడేవారిని ఫెమినిస్ట్ లు అని అంటుంటారు. ఫెమినిస్ట్ లు ఎక్కువగా మహిళలు మగాళ్ల కంటే ఎందులోనూ తక్కువ కాదు కదా అనే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. ఫెమినిస్ట్ ల వల్ల చాలా వరకు మహిళల జీవితాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వివాహ విషయంలో ఫెమినిస్ట్ ల వల్ల మహిళలకు కూడా ప్రాధాన్యత ఏర్పడింది. ఒకప్పుడు ఆడపిల్ల అభిప్రాయంతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. అబ్బాయి ఇష్టా ఇష్టాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో అమ్మాయి ఇష్టాఇష్టాలను అదే విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. మహిళల సమానత్వం గురించి మాట్లాడే స్త్రీ వాదుల వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది ఎందుకంటే ఇలా సమానత్వం అనే విషయం గురించి మాట్లాడటం వల్ల భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీస్తున్నాయని కొందరు వాపోతున్నారు. దీని గురించి తెలుసుకుంటే..
స్త్రీ వాదం..
స్త్రీ వాదం అనేది స్పష్టంగా స్త్రీని సమర్థిస్తూ, స్త్రీ హక్కుల గురించి, స్త్రీ పురుషుల సమానత్వం గురించి మాట్లాడే విషయం. స్త్రీ వాదంలో పేర్కొనే స్త్రీ పురుష సమానత్వ భావన స్త్రీ కి సమాజంలోనూ, ఇంటా, బయటా గౌరవాన్ని, స్త్రీ గతి శీలతను మార్చి వేసింది అని చెప్పవచ్చు. స్త్రీ వాదం ఎప్పుడూ స్త్రీని వెనుకబడిన వ్యక్తిగా కాకుండా సమాజంతో పాటు అభివృద్ది సాధించే వ్యక్తిగా మారుస్తుంది.
వివాహ మార్పు..
స్త్రీ వాదం వల్ల వివాహ విషయాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికాలంలో వివాహం చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం తొందరగా విడాకులకు దారి తీస్తున్నాయి. ఇందులో స్త్రీ వాదుల ప్రమేయమే ఎక్కువ కారణం అని కొందరి వాదన. అయితే భార్యాభర్తలు ఇద్దరూ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కేవలం పురుషుడు మాత్రమే అధికుడు అనే భావనతో ఉండటం సమంజసమైన విషయం కాదు. స్త్రీ, పురుషులు సమానం అని అంగీకరించినప్పుడు ఆ ఇద్దరి బందం ఎంతో ఆరోగ్యకరంగా సాగుతుంది. లింగ సమానత్వం అనేది బంధాల మీద ప్రబావం చూపినా అది భార్యాభర్తలను ఒక్కటిగా ఉంచేదే. అయితే ఈ లింగ సమానత్వాన్ని అంగీకరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
బాధ్యతలు..
ఇప్పటికాలంలో ఇంటి బాధ్యతల విషయానికి వస్తే ఆర్థిక విషయాలు అయినా ఇతరాలు అయినా మగవాడితో సమానంగా ఆడవారు కూడా బాధ్యతలు మోస్తున్నారు. లింగ సమానత్వం పరంగా చూస్తే ఆడవారు కూడా బాధ్యతలు పంచుకుంటారు. దీని వల్ల భార్యాభర్తలు ఇద్దరి మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్య పరంగా అయినా, కుటుంబ పరంగా అయినా మంచి మార్పుకు నాందిగా మారుతుంది. స్త్రీ వాదం కారణంగా బంధాల మధ్య బాధ్యతల విషయంలో ఎలాంటి సమస్యలు రావు కానీ భావోద్వేగాల విషయంలో మాత్రం మార్పులు ఉంటాయి.
ప్రాధాన్యత..
స్త్రీ వాదులు లింగ సమానత్వాన్ని పేర్కొన్నప్పుడు కుటుంబంలో మహిళలకు కూడా తమ అభిప్రాయాలు, ఆలోచనలు వ్యక్త పరిచే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఇద్దరి మధ్య కూడా సమ ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన లేనంత వరకు ఏ బంధం అయినా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ప్రేమను, నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి ఉంటారు.
నిర్ణయాలు..
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల మీద ఇద్దరూ బాధ్యత కలిగి ఉంటారు. అలాగే ఇద్దరూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంబంధిత విషయంలో ఇద్దరూ సమత్వ భావన కలిగి ఉంటారు. ఇది భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహనను పెంచుతుంది.
వివాహం, సక్సెస్ మంత్రం..
వివాహం చేసుకోవడం తేలిక.. కానీ ఆ వివాహ బంధం సక్సెస్ కావడం కష్టం. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ సమత్వ భావనతో లేనప్పుడు చాలా మనస్పర్థలు, గొడవలు ఏర్పడతాయి. అదే భార్యను కూడా భర్త గౌరవిస్తే.. ఇద్దరూ సమానమే అనే భావనతో ఉంటే ఆ బంధం చాలా వరకు ఆరోగ్యకరంగా ఉంటుంది. కుటుంబ పరంగా అయినా, కెరీర్ పరంగా అయినా, ఆర్థిక విషయాలు అయినా, పిల్లల పెంపకం అయినా.. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సమ ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల వివాహ బంధం సక్సెస్ అవుతుంది. స్త్రీ వాదం అనేది మహిళలకు సమ ప్రాధాన్యత ఇచ్చినా, దాన్ని అంగీకరించినప్పుడు అది వివాహ బంధాన్ని సూపర్ సక్సెస్ చేస్తుంది. అలా కాకుండా స్త్రీ ని వివక్షతో చూస్తే ఆ బంధం తొందరగా బీటలు వారుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/reasons-why-husbands-and-wives-fight-35-195738.html












