జగన్ క్షమాపణలు చెప్పకుంటే న్యాయపోరాటం.. పోలీసు అధికారలు సంఘం హెచ్చరిక
Publish Date:Apr 9, 2025
Advertisement
రాప్తాడు పర్యటనలో జగన్ పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే క్షమాపణలకు చెప్పాలని డిమాండ్ చేసింది. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామని జగన్ అనడాన్ని తీవ్రంగా ఖండించారు. బట్టలూడదీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలీసులు ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారన్న ఆయన జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పోలీసులు జనం కోసం పని చేస్తున్నారు తప్ప జగన్ వంటి నేతల కోసం కాదని అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేవలం రాజకీయ మైలేజ్ కోసం జగన్ తీపత్రేయపడుతున్నారని జనకుల శ్రీనివాస్ అన్నారు. పోలీసు యూనిఫారం ఉక్కు కవచం వంటిదనీ, రాజ్యాంగ హక్కును కాపాడేదనీ చెప్పిన ఆయన జగన్ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు జగన్ వ్యాఖ్యలను రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసు యూనిఫారం జగన్ ఇస్తే వేసుకున్నది కాదు, కష్టపడి చదివి సాధించినది, ఎవడో వచ్చి ఊడదీస్తామనడానికి ఇదేమీ అరటి తొక్క కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు. పోలీసు యూనిఫారంలో ఉండి చేసిన ఈ వీడియోలో నిజాయితీగా ఉంటాం, నిజాయితీగా ఛస్తాం అంతే కానీ ఎవడి కోసమో అడ్డదారులు తొక్కమంటూ సీరియస్ గా జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జాగ్రత్తగా మాట్లాడాలంటూ జగన్ ను హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/police-association-demand-jagan-appology-39-195933.html





