జనసేన తెలంగాణ ఎంట్రీ వెనుక ప్రధాని మోడీ?
Publish Date:Jun 20, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన పార్టీని తెలంగాణలో కూడా విస్తరించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా.. జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రయాణం అనే నినాదంతో నిర్వహించిన కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ కీలక ప్రకటన చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విస్తరణ ప్రణాళిక వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రకటించిన 9 వేల 400 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. గుడెబల్లూరు - మహబూబ్‌నగర్ మధ్య ఎన్‌హెచ్-167 రహదారి విస్తరణ, జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్, వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్, రూ. 1,535 కోట్ల విలువైన రైల్వే ఆధునీకరణ ప్రాజెక్టులను పవన్ కల్యాణ్ బాహాటంగా ప్రశంసించారు. వికసిత్ తెలంగాణ కోసం వికసిత్ భారత్ నినాదంతో కేంద్రం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను జనసేన క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని ఆయన పిలుపు కూడా ఇచ్చారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను దక్షిణాదిలో ఒక బలమైన జాతీయవాద ముఖచిత్రంగా నిలబెట్టేందుకు బీజేపీ అధిష్ఠానం కూడా ఆసక్తి చూపిస్తోంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంట్రీని ఈ కారణంతోనే కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పవన్ తెలంగాణలో జనసేన విస్తరణ అంటూ ప్రకటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తే.. పవన్ కళ్యాణ్ దీటుగా కౌంటర్ ఇస్తూ.. గతంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నాయకులు తమ సొంత రాష్ట్రాలు కాకపోయినా ఇతర ప్రాంతాల నుండి పోటీ చేసినప్పుడు లేని అభ్యంతరం, తనపై ఎందుకంటూ నిలదీశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సైబరాబాద్ పోలీసులు గచ్చిబౌలిలో జనసేన సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ తన జూబ్లీహిల్స్ నివాసంలో దాదాపు 50 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగట్టారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలపై స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా పర్యటించి, కొండగట్టు అంజన్న దేవాలయాన్ని దర్శించుకుని వారాహి యాత్ర ను ఇక్కడ కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో మోదీ అండ, క్షేత్రస్థాయిలో యువత క్రేజ్ కలగలిసి తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎలాంటి ప్రభావాన్ని చూపనుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/pm-modi-behind-janasenas-entry-into-telangana-39-223593.html




