అభిమాని ఇంటికి పవన్ కల్యాణ్.. అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ కు ఆర్థిక సాయం
Publish Date:Jun 17, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అరుదైన డీఎన్డీ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన తన అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతడినివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతోపాటు భగవంతుని తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణలోని హనుమకొండ హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతడిలో ఎదుగుదల లేదు. 17 ఏళ్ల వయస్సులో కూడా మూడు నాలుగేళ్ల పిల్లవాడిగానే కనిపిస్తాడు. పైగా నడవలేని పరిస్థితి. అతడు వవన్ కల్యాణ్ అభిమాని. ఎలాగైనా పవన్ కల్యాణ్ ను కలవాలన్నది అతడి బలమైన ఆకాంక్ష. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ బుధవారం (జూన్ 17) స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతడితో ఆత్మీయంగా మాట్లాడారు. అతడి తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భగవంతుడి ఆశీస్సులు బాబుకి ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులలో మనో ధైర్యం నింపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. నిరంజన్ వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని వారికి తెలిపారు. నిరంజన్ ను చూసేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ ఆతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం అన్న నిరంజన్ మాటలకు పవన్ కదిలిపోయారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ చేసిన డాన్సుల తాలూకు వీడియోలు, ఫొటోలను తిలకించారు. అంతా తనని చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు. ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా ఆ ఇంటి ఓనర్స్ ని పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్లో పని చేసేవారమని చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు. నిరంజన్ పరామర్శ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-visits-a-fan-home-36-223253.html





