జనసైనికులపై పవన్ కల్యాణ్ ఫైర్.. ఎందుకంటే?
Publish Date:Jul 10, 2026
Advertisement
జనసేన నాయకులు, క్యాడర్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండటం లేదా. ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయినప్పటికీ, అన్ని విషయాలలోనూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారా? అంటే తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన సూచనలు, వ్యక్తంచేసిన ఆగ్రహం చూస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రపక్షాలు, అధికారంలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల శైలిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి ప్రభుత్వంలో తమ పార్టీ తరఫున మంత్రులుగా ఉన్నవారికీ ఓ రేంజ్ లో క్లాస్ పీకారు. ప్రత్యర్థులు చేసే ఆరోపణలను దీటుగా తిప్పికొట్టాలని, సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాన్ని గట్టిగా ఖండించాలనీ చాలా సీరియస్ గా పార్టీ లీడర్, క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చారు. గత రెండు మూడు నెలలుగా పవన్ కల్యాణ్ పలు సందర్భాలలో ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పారు. అయినా పార్టీ నేతల నుంచి, శ్రేణుల నుంచీ పెద్దగా స్పందన లేకపోవడంతో ఈ సారి మరింత సీరియస్ గా ఇక యాక్టివ్ గా ఉండి తీరాలని ఒక విధంగా విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. పార్టీలో ఎవరో ఒకరిద్దు మాత్రమే..అది కూడా అడపాదడపా మాత్రమే స్పందిస్తున్నారని పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ప్రశ్న రావణ్ అరెస్టు, అతడిపై, ఉపా చట్టం కింద కేసుఅంశాలు పెను సంచలనంగా మారాయి. ఈ విషయంలో వైసీపీ సామాజిక మాధ్యమ విభాగాలు పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్నాయి. అయినా జనసేన నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. వైసీపీ దుష్ప్రచారాన్నీ, విమర్శల దాడిని తిప్పికొట్టే ప్రయత్నాలేవీ జనసేన నుంచి జరగడం లేదు. దీంతో ఏకపక్షంగా వైసీపీ చేస్తున్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్లి, అదే వాస్తవమన్న భ్రమలో ప్రజలు పడే ప్రమాదం ఉంది. దీంతో జనసేనాని తీవ్ర అసహనానికి లోనై పార్టీ లీడర్లకు గట్టిగా క్లాస్ పీకారంటున్నారు. ఈ విషయంలో జనసేనాని.. పార్టీ లీడర్లు క్యాడర్లకు.. తెలుగుదేశం పార్టీని చూసైనా నేర్చుకోండంటూ ఒకింత ఘాటుగానే మందలించారని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ప్రత్యర్థులు చిన్న విమర్శ చేసినా..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ తెలుగుతమ్ముళ్లంతా ఏకతాటిపైకి వచ్చి కౌంటర్లు ఇవ్వడాన్ని జనసేనాని తన పార్టీ వారికి ఉదహరించినట్లు చెబుతున్నారు. ఇక నుంచి యాక్టివ్ అయి తీరాలని జనసేనాని ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశం ఇచ్చినట్లు చెబుతున్నారు. Pawan Kalyan, Janasena leaders, TDP leaders, Chandrababu Naidu, AP Politics
http://www.teluguone.com/news/content/pawan-kalyan-lashes-out-at-janasainiks-39-225610.html





