పార్లమెంట్ పరీక్ష ఎవరికి?
Publish Date:Jul 18, 2022
Advertisement
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ( సోమవారం) నుంచి మొదలవుతున్నాయి. వచ్చేనెల (ఆగష్టు) 12వ తేదీ వరకూ మొత్తం 14 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు జరుగ నున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 32 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అందులో 14 బిల్లులు సిద్డమయ్యాయి. మరో వంక ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. త్రివిధ దళాల్లో తాత్కాలిక నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకం, ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తాలని విపక్షాలు భావిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు తమ అజెండాను ప్రభుత్వం ముందుంచాయి. అదే సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపక్షాలను కోరారు. అలాగే నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అగ్నిపథ్, ఆర్ధిక పరిస్థితి, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల. ద్రవ్యల్బణం ఏదంటే అది చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అయితే, అందుకు ప్రతిపక్షాలు నిబంధనలు పాటించాలని షరతు విధించారు. అయితే ఇదంతా రొటీన్ గా జరిగే వ్యవహారమే. ఇందులో కొత్తదనం లేదు. చివరకు సభలో ఏమి జరుగుతుందో, అదే నిజం. అదే కీలకం. గత అనుభవాలను గుర్తు చేసుకుంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేది అందరికీ తెలిసిన విషయమే. లోతుల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే ఏది ఏమైనా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీ వేడీగా సాగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వరస ఎన్నికల విజయాలతో మాంచి జోష్ మీదున్న అధికార బీజేపీ / ఎన్డీఎ కూటమి కంటే, వరస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ సారథ్య విపక్షానికే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పరీక్ష కాబోతున్నాయని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే రాష్ట్రపతి ఎన్నిక రూపంలో విపక్షాలకు తొలి పరీక్ష ఎదురవుతోంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా చివరి యత్నంగా ఆత్మ ప్రబోధం అపీల్ చేశారు. కానీ, అది పనిచేసే వాతావరణం కనిపించడం లేదని ప్రతిపక్షాలే పెదవి విరుస్తున్నాయి. ప్రతిపక్ష అభ్యర్ధి గెలిచే అవకాశాలు లేవు. అది అందరికీ తెలుసు. అయితే ఆశించిన మేరకు అయినా యశ్వంత్ సిన్హాకు మద్దతు లభించే అవకాశం ఉందా అంటే అదీ లేదని తేలిపోయింది. ఎందుకంటే ప్రతిపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలే ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. చివరికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి క్రాస్ వోటింగ్ ఉంటుంది అని అంటున్నారు. అధికార ఎన్డీఎ కూటమి గిరిజన మహిళా ద్రౌపతి ముర్మును అధికార కూటమి అభ్యర్ధిగా ప్రకటించడంతోనే సీన్ మారిపోయిందని మమతా బెనర్జీనే బహిరంగంగా అంగీకరించారు. ఈ నేపధ్యంలో యశ్వంత్ సిన్హాకు, ఆశించిన శాతం ఓట్లు రాకపోతే, ప్రతిపక్షాల ఐక్యత మరోమారు నవ్వుల పాలవుతుంది. ఎండమావిగా తెలిపోతుందని అంటున్నారు. ఒక విధంగా రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ఓటమికి మరో నిదర్శనంగా నిలుస్తుందని, ఆ ప్రభావం రానున్న రోజుల్లో దేశ రాజకీయాలపై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఉప రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి మార్గరెట్ ఆల్వా విషయంలోనూ ప్రతిపక్షాలలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మార్గరెట్ ఆల్వా తన జీవిత చరిత్రలో, కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీకి వెస్ట్ ల్యాండ్ కుంభకోణంతో సంబంధమున్న విషయాన్ని ప్రస్తావించిచారని బీజేపీ బయట పెట్టింది. ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు గాంధీ కుటుంబంపై అంత తీవ్ర ఆరోపణలు చేసిన మార్గరెట్ అల్వాకు కాంగ్రెస్ పార్టీ ఎలా మద్దతు ఇస్తుందని కొందరు కాంగ్రెస్ నాయకులే ప్రశ్నిస్తున్నారు. మరో వంక, తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ, తెరాసకు కూడా కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇచ్చే విషయంలో అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల విషయం ఎలా ఉన్నా, రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా తెరాస మద్దతు ఇచ్చే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా, కాంగ్రెస్, తెరాసల మధ్య పెద్ద రచ్చే జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన యశ్వంత్ సిన్హాను, కాంగ్రెస్ నాయకులు ఎవరూ కలవడానికి వీలు లేదని, హుకుం జారీ చేశారు. కాదని కలిస్తే గోడకేసి కొడతానని హెచ్చరించారు. అంతే కాదు, ఆ ఇంటి (ప్రగతి భవన్) మీద వాలిన కాకి ఈ ఇంటి ( గాంధీ భవన్) మీద వాలేందుకు వీలు లేదని పేర్కొన్నారు. అదీగాక, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్న కేసీఆర్ మార్గరెట్ అల్వాకు మద్దతు ఇస్తారా? ఇస్తే, అందుకు అయన ఎలాంటి సాకు చూపుతారు అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. సో .. ఎలా చూసినా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రభుత్వం, అధికార కూటమి కంటే, ప్రతిపక్షాలకే పెద్ద పరీక్షగా నిలిచే అవకాశమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/parliament-challange-for-government-on-opposition-39-139991.html





