నవాజ్ షరీఫ్ వికెట్ పడింది! పాక్ లో మ్యాచింకా మిగిలే వుంది!
Publish Date:Jul 30, 2017
Advertisement
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి ఊడిపోయింది. అక్కడి సుప్రీమ్ కోర్ట్ అతడ్ని అవినీతి కేసులో దోషిగా గుర్తించింది. అయితే, చాలా మంది భావిస్తున్నట్టు పీఎం పదవి పోవటం అతడు పనామా పేపర్స్ వ్యవహారంలో చేసిన అవినీతికి శిక్షగా కాదు! పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ప్రధాని పదవిలో వున్న వారు నిజాయితీగా వుండాలి. ఇది ఓ అస్పష్టమైన రూల్! దాని ఆధారంగా సుప్రీమ్ జడ్జీలు అతడ్ని పదవి నుంచి తొలగించారు! ముందు ముందు పనామా పేపర్స్ లో బయటపడ్డ విధంగా నవాజ్ షరీఫ్ అవినీతికి పాల్పడ్డారని కోర్టు పూర్తిగా నిర్ణయిస్తే… అప్పుడు శిక్షేంటో తెలుస్తుంది! పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ తప్పుకోవటం ఆ దేశ అంతర్గత వ్యవహారం. దాని వల్ల మనకేంటి నష్టం? లేదా లాభం? నిజానికి లాభ, నష్టాలు రెండూ వుండవని అంటున్నారు నిపుణులు! పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ పీఎం పదవి నుంచి తప్పుకుంటే ఇప్పటికిప్పుడు వచ్చే అనూహ్య పరిణామాలు ఏమీ లేవట. కారణం… ప్రధానిగా లేకున్నా నవాజ్ షరీఫే ముందు ముందు కూడా చక్రం తిప్పుతాడు. అతడి పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్ పూర్తి మెజార్టీతో వుంది. కాబట్టి తన స్థానంలో మరో నాయకుడ్ని పీఎంని చేస్తాడు. అతడి చేత తాను కోరుకున్న విధంగా పాలన చేయించుకుంటాడు. ఇండియాలోనో, బ్రిటన్ లోనో ప్రైమినిస్టర్ కి వున్నంత సీన్ … ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధానికి పాక్ లో వుండదని కూడా మనం గుర్తించాలి. అక్కడ ఇప్పటికీ ఆర్మీ అధికారులదే అసలు అధికారం.ఐఎస్ఐదే అసలు వ్యూహం. రాజకీయ నేతలు దాదాపు డమ్మీలే. అందుకే, షరీఫ్ కాక రేపు మరెవరైనా పీఎం అయినా ఇండియా పట్ల వైఖరేం మారేది వుండదంటున్నారు విశ్లేషకులు. అలా కాక ముషర్రఫ్ లాగా ఆర్మీ జనరల్సే అధికారం చేజిక్కించుకుంటే పాక్ లో మరింత అరాచకం చెలరేగవచ్చు. ప్రజాస్వామ్య బద్ధమైన ప్రధాని లేక ఇండియాతో యుద్ధానికి మరింత తేలిగ్గా తెగబడవచ్చు. అయితే, పాక్ మిలటరీ పాలకుల చేతుల్లో లేకున్నా ఇండియాతో యుద్ధం అంటే ఎల్లప్పుడూ ఆసక్తిగానే వుంటుంది. కారణం… పాకిస్తాన్ ప్రజలు అసలు సమస్యల మీద దృష్టి పెట్టకుండా వుంచగలిగేది భారత్ బూచి ఒక్కటి మాత్రమే! కోర్టు కారణంగా నవాజ్ షరీఫ్ పదవి కోల్పోయినా… వచ్చే సంవత్సరం రానున్న జాతీయ ఎన్నికల్లో కూడా అతడి పార్టీకి ఢోకా లేదంటున్నారు కొందరు ఎక్స్ పర్ట్స్! ఇదే ఇప్పుడు అసలు విషాదం. నవాజ్ షరీఫ్ అవినీతిపరుడని కోర్టుకీడ్చిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చాలా సంతోషంగా వున్నాడు. అవినీతిపై విజయం తనదేనని చెప్పుకుంటున్నాడు. కాని, అతడి పార్టీ అయిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పాక్ మొత్తంలో సీట్లు గెలుచుకునే సీన్ అస్సలు లేదట. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా పాక్ జనం గత్యంతరం లేక నవాజ్ పార్టీ అయిన పీఎంఎల్ కే ఓటు వేస్తారని విళ్లేషకులు లెక్కలు కడుతున్నారు! మొత్తం మీద… చాలా మంది అభిప్రాయం కారణం నవాజ్ షరీఫ్ విషయంలో పాక్ సుప్రీమ్ కోర్టు తీర్పు… టీ కప్పులో తుఫానే!
http://www.teluguone.com/news/content/pakistan-political-crisis-45-76666.html





