ఉస్మానియా విద్యార్థుల కలలు కరుగుతున్నాయి!
Publish Date:Jul 19, 2014
Advertisement
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎంతగానో కృషి చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే చల్లారిపోయిందని అనుకున్న తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఉవ్వెత్తున ఎగసిందంటే దానికి ప్రధాన కారణం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులే. ఉద్యమాన్ని కొనసాగించలేక చేతులు ఎత్తేసిన, జ్యూసులు తాగిన నేతలు కూడా విద్యార్థుల ప్రభంజనాన్ని చూసి ఉద్యమాన్ని కొనసాగించాల్సివచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటూ అనేకమంది ఉస్మానియా విద్యార్థులు ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారు. విద్యార్థులు ఉద్యమం విషయంలో ఇంత పట్టుదలగా వుండటానికి కారణం, తెలంగాణ రాష్ట్రం వస్తే తమకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశే! అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులలో కలుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది తెలంగాణ విద్యార్థుల మీద పిడుగుపాటుగా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేస్తే తమకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయన్న ఆందోళన వారిలో పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ కూడా జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థిలోకం గళమెత్తుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్ళపాటు పెంచింది. అదే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కూడా తీసుకోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్న పక్షంలో రెండేళ్ళపాటు ఉద్యోగాల ఖాళీలు ఏర్పడవు. చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ ఖాళీలు వుండవు. ఇది కూడా తెలంగాణ విద్యార్థుల ఆగ్రహానికి, ఆందోళనకీ కారణమవుతోంది.
http://www.teluguone.com/news/content/osmania-university-students-telangana-students-unhappy-with-telangana-government-45-36153.html





