ఆయుధమే దేశానికి రక్ష.. భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం..!
Publish Date:Mar 18, 2025

Advertisement
యుద్దమంటూ జరిగితే మనుషుల కంటే ఆయుధాలే కీలకపాత్ర పోషిస్తాయి. దేశ సంరక్షణ నుండి మనిషి సంరక్షణ వరకు ఆయుధాలే కవచాలు అవుతాయి. ఇక భారతదేశ రక్షణ విభాగంలో ఆయుధాల పాత్ర మాటల్లో చెప్పలేనిది. ఎంతటి వీరుడైనా చేతిలో ఆయుధం పట్టుకున్నాడంటే అతని శక్తి వందరెట్లు లేదా వెయ్యి రెట్లు పెరుగుతుంది. ఇంత ప్రాధాన్యత ఉన్న ఆయుధాల తయారీ అనేది చాలా నైపుణ్యంతో కూడుకున్న విషయం. బొమ్మ పిస్తోల్, బొమ్మ కత్తులు, బొమ్మలు తయారు చేసినట్టు ఆయుధాలను తయారు చేయడం కుదరదు. భారతదేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయుధాలు ఉత్పత్తి చేసే కర్మాగారాల దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 18వ తేదీన జరుపుకుంటారు. ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ చేసిన కృషిని గుర్తించి, గౌరవించే దిశగా ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఆయుధాలు, ఆయుధాల ఉత్పత్తి ప్రక్రియలలో తాజా పరిణామాలను ప్రదర్శించే వివిధ కర్మాగారాల కవాతులు, ప్రదర్శనలు, అవార్డు వేడుకలు జరుగుతాయి.
ఇది చరిత్ర..
భారతదేశ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు బ్రిటిష్ వలస రాజ్యాల కాలం నాటి నుండే వాటి మూలాలు కలిగి ఉన్నాయి. బ్రిటీష్ సైన్యం అవసరాలను తీర్చడానికి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1775లో కోల్‌కతాలో బోర్డ్ ఆఫ్ ఆర్డినెన్స్‌ను స్థాపించింది. ఆ తర్వాత వెంటనే ఇషాపూర్‌లో (1787) గన్‌పౌడర్ ఫ్యాక్టరీని, 1787లో కోసిపూర్‌లో గన్ క్యారేజ్ ఫ్యాక్టరీని నిర్మించారు. దీన్నే ఇప్పుడు గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు.
1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఈ కర్మాగారాలు భారత ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం మార్చి 18న జరుపుకునే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం భారతదేశ ఆయుధ ఉత్పత్తికి జన్మస్థలంగా గుర్తించబడిన కోసిపోర్ ఫ్యాక్టరీ స్థాపనను గుర్తుచేస్తుంది.
ప్రాముఖ్యత..
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం భారతదేశంలో మొట్టమొదటి ఆయుధ కర్మాగార స్థాపనను సూచిస్తుంది. దేశీయ ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉత్పత్తికి ఇదే పునాది.
భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (IOFలు) భారత సాయుధ దళాలకు సరఫరా చేయడంలో తమ పరిశోధన, అభివృద్ధి, తయారీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ఇందులో విస్తృత శ్రేణి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ప్రదర్శించడం కూడా ఉంటుంది. భారత సైన్యాన్ని సన్నద్ధం చేయడం ద్వారా జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న IOF శ్రామిక శక్తి అంకితభావం, కృషిని గుర్తించి అభినందించే రోజు ఇది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను ఇది ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం రక్షణ రంగంలో భారతదేశం శక్తిని, ప్రతిష్టను బలోపేతం చేస్తుంది.
రక్షణ మంత్రిత్వ శాఖలో ఉండే రక్షణ ఉత్పత్తి విభాగం పర్యవేక్షించే ఒక భారీ పారిశ్రామిక సముదాయం అయిన ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (IOFలు) భారతదేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోల్‌కతాలో ప్రధాన కార్యాలయం కలిగిన IOFలు దేశవ్యాప్తంగా 24 ప్రదేశాలలో విస్తరించి, 41 కర్మాగారాల విస్తారమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ఈ కర్మాగారాలకు 9 శిక్షణా సంస్థలు, 3 ప్రాంతీయ మార్కెటింగ్ కేంద్రాలు, 4 ప్రాంతీయ భద్రతా నియంత్రణ కార్యాలయాల నెట్‌వర్క్ మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలో 10 కర్మాగారాలు అత్యధికంగా ఉన్నాయి. తరువాత ఉత్తర ప్రదేశ్ (9), మధ్యప్రదేశ్ (6) ఉన్నాయి.
*రూపశ్రీ
http://www.teluguone.com/news/content/ordnance-factory-day-35-194614.html












