నేతాజీ చనిపోలేదా? 117ఏళ్ల ఆయన డ్రైవర్ నిజాముద్దీన్ నమ్మిన నిజమేంటి?
Publish Date:Feb 7, 2017
Advertisement
'' నేతాజీ 1945లో విమాన దుర్ఘటనలో చనిపోలేదు! '' ఈ మాటలు మనం ఇప్పుడు కొత్తగా వింటున్నవి కాదు! దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ పదే పదే వినిపిస్తూనే వున్నాయి. కాని, నిన్న ఒక 117ఏళ్ల పెద్దాయన వారణాసిలో చనిపోయాడు. ఆయన కూడా ఇదే అనటమే ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది! ఇంతకీ ఆయనెవరో తెలుసా? నేతాజీ అనుంగు అనుచరుడు. పేరు నిజాముద్దీన్. బోస్ గురించి తన జీవితాంతం ఒకానొక పెద్ద నిజాన్ని మనసులోనే దాచుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు! నిజాముద్దీన్ తన సుదీర్ఘ జీవితంలో ఏనాడూ నేతాజీ మరణించాడంటే ఒప్పుకోలేదు! అంతే కాదు, మన దేశ ప్రభుత్వాలు ఎన్నిసార్లు కమిటీలు, కమీషన్లు వేసినా అన్నిటికి తనతో దాగిన నిజాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు నిజాముద్దీన్. కాని, ఆయన్ని ఏ సత్య శోధన బృందమూ పట్టించుకోలేదు. కాని, ఆయన చెప్పిన మాటలు మాత్రం బోస్ అభిమానులకి, భారతీయులందరికీ ఎంతో ఆసక్తి, ఆనందం కలిగిస్తాయి! దాదాపు నాలుగేళ్లు సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీలో నిజాముద్దీన్ పని చేశాడు. అత్యంత సన్నిహితంగా ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతితో మసిలేవాడు. అయితే, 1945లో తైవాన్ లో విమానం కూలి నేతాజీ చనిపోయాడని చెబుతోన్న తేదీ తరువాత ... దాదాపు మూడు నెలలకి తాను సుభాష్ ని బర్మా బార్డర్ వద్ద కార్ లో దిగబెట్టానని నిజాముద్దీన్ చెప్పేవాడు. ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లో బోస్ చాలా ఏళ్లు గుమ్నామి బాబాగా సన్యాస జీవితం గడిపాడని కూడా అనేవాడు. నిజాముద్దీన్ మాటల్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని, 2015లో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రహస్య డాక్యుమెంట్లు బయట పెట్టింది. వాటిల్లో నేతాజీ ప్లెయిన్ క్రాష్ లో చనిపోలేదని అనుమానం వ్యక్తం అయింది. నిజాముద్దీన్ ఆ సమయంలో తన వాదన నిజమైందని వాదించాడు! నిజానికి ఒకప్పుడు చాలా ఏళ్లు బ్రిటీష్ వారి సేవలో సైనికుడిగా వున్న సైఫుద్దీన్ తరువాత నిజాముద్దీన్ గా పేరు మార్చుకున్నాడు. బోస్ పిలుపుతో ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరి గూఢచారిగా పని చేశాడు. అందుకే, పేరు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, నిజాముద్దీన్ 1945లో బోస్ ను సురక్షితంగా బర్మా బార్డర్ లోదించేసి తిరిగొచ్చాడు. అప్పట్నుంచీ 2017 ఫిబ్రవరీ 6 వరకూ ఉత్తర్ ప్రదేశ్ లోనే జీవించాడు. ఆయన విశ్వాసం ప్రకారం నేతాజీ కూడా గుమ్నామీ బాబాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనే శేష జీవితం గడిపాడు! ఇదంతా మనం ఎంతో కొంత నమ్మితీరాల్సిందే! ఎందుకంటే, నిజాముద్దీన్ నిస్వార్థంగా, నిజాయితీగా బోస్ వెంట నడిచిన స్వాతంత్ర్య సమర యోధుడు. పైగా జన్మతః ముస్లిమ్. ఆయనకు బోస్ ను హిందూ సాధువుగా జీవించాడని చెప్పటంలో ఎలాంటి స్వార్థం వుండే అవకాశం లేదు! నిజాముద్దీన్ జీవిత కాల కోరిక నేతాజీ మరణం చుట్టూ అల్లుకున్న మిస్టరీ పొర తొలిగిపోవాలనీ! నిజం బయటకు రావాలని దురదృష్టవశాత్తూ 117ఏళ్లు జీవించిన నిజాముద్దీన్ తాను కోరిన , నమ్మిన నిజం వెలుగు చూడకుండానే కన్నుమూశాడు!
http://www.teluguone.com/news/content/netaji-45-71890.html





