లోకేష్ వైఖరి పార్టీకి చేటంటూ.. తెలుగుదేశం సీనియర్లలో అసంతృప్తి!
Publish Date:Aug 8, 2026
Advertisement
కృష్ణా జిల్లా విజయ డైరీ చైర్మన్ ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో దుమారాన్ని రేపుతోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది. విజయ డైరీ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేయాలంటూ సొంత పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సీనియర్ నాయకుడు చెలసాని ఆంజనేయులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంత్రుల వేధింపులు, ఒత్తిడి తట్టుకోలేక ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఆ తరువాత అధిష్ఠానం మాటను శిరసవహిస్తున్నానంటూ రాజీనామా చేశారు. అది వేరే సంగతి. 1983లో టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరుపొందిన చెలసాని ఆంజనేయుల పట్ల అధిష్టానం ప్రవర్తించిన తీరుపై సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని, రైతుల్లో ఎంతో మంచి పేరున్న నాయకుడిని ఇలా అవమానకర రీతిలో పదవి నుంచి దిగిపోవాలని హుకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలపై ప్రముఖ విశ్లేషకుడు సువేరా తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నారా లోకేష్ తీరు సమంజసంగా లేదన్నారు. గన్నవరం నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, అవకాశవాదులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల స్థానిక పార్టీలో వర్గపోరు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరంచారు. మద్యం ముఠాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభావంతో లోకేష్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న సందేహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ చుట్టూ ఉన్న కోటరీ చెప్పే మాటలే వింటూ, సోషల్ మీడియా పబ్లిసిటీకే పరిమితమవుతూ క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, సీనియర్ల మనోభావాలను తెలుసుకోకుండా రీల్స్, ప్రచార ఆర్భాటాలను నమ్ముకుంటే గతంలో వైసీపీకి పట్టిన గతే తెలుగుదేశం పార్టీకి కూడా పడుతుందని హెచ్చరించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన చెలసాని ఆంజనేయులుపై, ఇప్పుడు సొంత పార్టీ నాయకులే కక్షపూరితంగా వ్యవహరించడం విచారకరమని సువేరా అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం పట్ల జిల్లాలోని రైతాంగం, టిడిపి నేతల్లో కూడా విస్మయం, ఆగ్రహం వ్యక్తమౌతున్న పరిస్థితి ఉందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరిచి పదవులు ఇస్తూ, పార్టీకి వెన్నుముకలా నిలిచిన పాత నాయకులను విస్మరించడం జిల్లాలో పార్టీ పునాదులను కదిలిస్తుందని సువేరా పేర్కొన్నారు. దేవినేని ఉమా వంటి ఉద్దండ సీనియర్ నాయకులను కూడా పక్కన పెట్టడం ఏమిటని నిలదీశారు. ఇప్పటికైనా టిడిపి అధిష్టానం, నారా లోకేష్ క్షేత్రస్థాయి పరిస్థితిని గ్రహించి సీనియర్ నాయకులకు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. Nara Lokesh, TDP Leadership, Chalasani Anjaneyulu Vijaya Dairy, Krishna District TDP Politics, Senior Leaders Discontent
http://www.teluguone.com/news/content/nara-lokesh-25-228400.html





