మరో సారి ముద్రగడ.. జగన్ భజన
Publish Date:Apr 14, 2025
.webp)
Advertisement
స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి తన స్థాయిని, తన ప్రతిష్టనూ తనే దిగజార్చుకుంటున్నారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో మంచి ప్రాధాన్యతే ఉండేది. కాపులకు రిజర్వేషన్ అంటే ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ఆయన ఉద్యమించిన సమయంలో లక్షలాదిగా యువత ఆయన వెంట నడిచారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆయనను కాపు సామాజికవర్గం తమ నేతగా అంగీకరించే పరిస్థితి లేదు. ఇది నిస్సందేహంగా ఆయన స్వయంకృతాపరాథమే అని చెప్పక తప్పదు.
ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు కాపు రిజర్వేషన్లకు సుముఖంగా ఉన్న చంద్రబాబును కాదని.. ఆ ప్రతిపాదనకు నో చెప్పిన జగన్ కు ముద్రగడ మద్దతు ఇచ్చారు. ఇక జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టేసి, అంతకు ముందు చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత వెల్లువెత్తింది.
వాస్తవానికి ముద్రగడ పద్మనాభం 2014-19 మధ్యలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం అంటూ గొంతెత్తడానికి కారణం చంద్రబాబు సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికేనని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా ముద్రగడ 2104-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ నినాదాన్ని ఎత్తుకున్నారంటారు. అయితే అప్పట్లో చంద్రబాబు ఈడబ్ల్యుఎస్ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించినా ముద్రగడ దానిని స్వాగతించలేదు. కాపు సామాజిక వర్గానికి మేలు చేసే ఆ నిర్ణయాన్ని ముద్రగడ వ్యతిరేకించడానికి కారణం చంద్రబాబు పట్ల అయిష్టతేననీ, అహంకారం వినా ముద్రగడకు కాపు సామాజిక వర్గంపై అభిమానం లేదనీ, వారి ప్రయోజనాలు పట్టవనీ, అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
ఇక 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్టాలు చేపట్టిన తరువాత కాపు లకు 5శాతం కోటాను రద్దు చేశారు. అప్పుడు కూడా జగన్ ను విమర్శిస్తూ ముద్రగడ నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అంతే కాదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ముద్రగడ నోటి వెంట కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి మరిచిపోయారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేయడంతో సరిపెట్టుకోకుండా ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుడ్డి వ్యతిరేకత పెంచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదన్న దుగ్థ, అసూయ కారణంగానే ముద్రగడ పవన్ ను వ్యతిరేకించారని కాపు సామాజికవర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన ముద్రగడ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ముద్రగడకు వైసీపీలో ఎలాంటి గౌరవం లభించలేదు. అసలు ఈ మధ్య కాలంలో ముద్రగడకు జగన్ దర్శన భాగ్యమే దొరకలేదని చెప్పొచ్చు. అయినా ముద్రగడ నోటి వెంట జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట రాలేదు.
అటువంటి ముద్రగడ ఇప్పుడు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కారణమేంటంటే.. వైసీపీ అధినేత జగన్ తాజాగా 33 మంది సభ్యులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించారు. ఆ 33 మందిలో ముద్రగడ పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ పనేమిటి? అంటే.. రాష్ట్ర రాజకీయపరిస్థితులపై చర్చించి.. జగన్ కు అవసరమైన సలహాలు ఇవ్వడం. ఈ కమిటీకి సజ్జల కన్వీనర్ గా ఉన్నారు. ఆ 33 మంది సభ్యుల కమిటీలో తనను ఒకరిగా చేర్చినందుకే ముద్రగడ తన జన్మధన్యమైపోయిందన్నంతగా ఆనందపడిపోతున్నారు. వాస్తవానికి వైసీపీలో నిర్ణయాలన్నీ జగన్ ఆయన కోటరీ మాత్రమే తీసుకుంటారన్నది అందరికీ తెలిసిందే. అందుకే వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నామ్ కే వాస్తే అన్న విషయం ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అటువంటి నామ్ కే వాస్తే కమిటీలో ఓ సభ్యుడిగా తనను చేర్చినందుకే బ్రహ్మానందపడిపోతున్నారు. తనకు పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీలో స్థానం కల్పించినందుకు జగన్ కు కృతజ్ణతలు చెబుతూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
జగన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని, జగన్ సీఎం కావడానికి తన శక్తి మేరకు తాను పోరాడతాననీ ముద్రగడ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక ముద్రగడ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే తన ధ్యేయమన్నారు. కానీ జరిగిందేమిటి? 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి విజయం సాధించారు. అంటే జిల్లాలో ముద్రగడకు ఉన్న పలుకుబడి ఏమిటి? ఎంత అన్నది తేలిపోయిందని, కాపు సామాజిక వర్గం ముద్రగడను నమ్మడం లేదనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. పిఠాపురంను పక్కన పెడితే 2024 ఎన్నికల్లో ముద్రగడ సొంత నియోజకవర్గం జగ్గంపేటలో తెలుగుదేశం అభ్యర్థి 52 వేల 675 ఓట్ల ఆధిక్యతతో భారీ విజయం సాధించారు. అంత దాకా ఎందుకు 1999 నుంచి ముద్రగడ ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా విజయం సాధించలేదు. ముద్రగడ చివరి సారిగా 2014 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘోరంగా కనీసం డిపాజిట్ కూడా రాకుండా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పోరాడుతానంటూ గంభీర ప్రకటనలు చేయడం ద్వారా తన ప్రతిష్టను తానే మరింత దిగజార్చుకోవడమే కాకుండా నవ్వుల పాలౌతున్నారు.
http://www.teluguone.com/news/content/mudragada-jagan-bhajana-again-25-196180.html












