చారిత్రక నవలా చక్రవర్తి: డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ ఇక లేరు.!
Publish Date:Oct 8, 2026
Advertisement
తెలుగు సాహిత్య ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సాహితీవేత్త, చారిత్రక నవలా రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ కన్నుమూశారు. చారిత్రక నవలా చక్రవర్తిగా సాహితీ ప్రియుల ఆదరణ పొందిన ఆయన గురువారం (అక్టోబర్ 8) రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని శివమ్‌రోడ్‌లో ఉన్న తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 1940 డిసెంబర్ 23న అప్పటి ప్రకాశం జిల్లా పరిధిలోని ఆకులల్లూరులో జన్మించిన ముదిగొండ శివప్రసాద్ ఉన్నత విద్యను అభ్యసించి అధ్యాపకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం ఆచార్యుడిగా పని చేశారు. నిరంతర అధ్యయనం, విస్తృత రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. చరిత్రలోని రాజులు, రాజ్యాలు, సామాజిక పరిణామాలు, సంస్కృతిని ఆసక్తికరమైన కథనాలుగా మలచడం శివప్రసాద్ రచనల్లో ప్రత్యేకత. ఆయన రచించిన ఆవాహన , శ్రీపదార్చన, వంశధార, తంజావూరు విజయం, ‘సమ్రాట్ పుష్యమిత్ర, బసవగీత తదితర రచనలు పాఠకుల్లో విశేష ఆదరణ పొందాయి. ఆయన వందకుపైగా నవలలు రాశారు. నవలా రచయితగానే కాకుండా సినిమా, డాక్యుమెంటరీ రంగాలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. ఆయన రచనల ఆధారంగా కొన్ని చిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందాయి. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాకు డాక్టర్ ముదిగొండ రచనా సహకారం అందించారు. చరిత్ర, సాహిత్యం, సంస్కృతిపై ఆయనకున్న పట్టు రచయితగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ముదిగొండ శివప్రసాద్ మృతిపట్ల పలువురు రచయితలు, సాహితీవేత్తలు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహిత్య ప్రపంచంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. చారిత్రక నవలా ప్రక్రియకు తనదైన శైలిని అందించి, తెలుగు పాఠకులకు గత చరిత్రపై ఆసక్తిని పెంచిన ఆయన రచనలు భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ అంత్యక్రియలు శుక్రవారం (అక్టోబర్ 9)న నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
[Mudigonda Sivaprasad No More, Doctor Mudigonda Sivaprasad, Historical Novelist, Telugu literature, famous Telugu writer, Telugu One]
http://www.teluguone.com/news/content/mudigonda-sivaprasad-no-more-24-233803.html




