ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, కొదండరాం ప్రమాణ స్వీకారం
Publish Date:Apr 27, 2026
Advertisement
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన మంత్రి అజారుద్దీన్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సోమవారం (ఏప్రిల్ 27) ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మొహమ్మద్ అజారుద్దీన్‌కు ఈ ప్రమాణ స్వీకారం భారీ ఊరటనిచ్చింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలలోగా ఏదో ఒక చట్టసభకు ప్రాతినిథ్యం వహించాలి. అంటే.. శాసనసభ, మండలి సభ్యుడిగా ఎన్నిక కావాలి. మంత్రి అజారుద్దీన్ కు ఈ ఆరునెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ గడువు ముగియడానికి మూడు రోజుల ముందే ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రిపదవికి ఉన్న చిక్కులు తొలగిపోయాయి. ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఉద్యమ నేతగా పేరున్న ఆయన ఇకపై ప్రజా సమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై మండలి వేదికగా తన గళాన్ని వినిపించనున్నారు. ఈ నియామకంతో శాసనమండలిలో అధికార పక్షం బలం పెరిగింది.
http://www.teluguone.com/news/content/minister-azharuddin-and-kodandaram-sworn-in-as-mlcs-25-218351.html





