హరీష్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మిల్చి మిల్క్ వివాదం.!
Publish Date:Jul 14, 2026
Advertisement
బీఆర్ఎస్ కీలక నేత, పార్టీలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇప్పుడు తానే ఒక ట్రబుల్ లో చిక్కుకున్నారు. సాధారణంగా రాజకీయ వ్యూహాలు, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటాలతో నిత్యం ప్రజలతో మమేకమై వార్తల్లో ఉండే హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్ విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు. మిల్చి మిల్క్ బ్రాండ్, ఆర్ఎన్ఎస్ నేచర్స్ ప్రొడక్ట్స్ సంస్థకు సంబంధించిన లావాదేవీలపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ హాట్ చర్చ జోరందుకుంది. 2020 ఆగస్టులో.. అంటే కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలకు రోగనిరోధక శక్తిని పెంచే నాణ్యమైన పాల ఉత్పత్తులను అందిస్తామంటూ హరీశ్ రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఈ మిల్చి మిల్క్ బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రారంభంలో పూర్తిగా హైజెనిక్ పద్ధతుల్లో, ఆధునిక సాంకేతికతతో వినియోగదారుల ఇంటికే స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తామని ప్రకటించిన ఈ సంస్థ, ఆ తర్వాత కాలంలో విస్తరించింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రైవేట్ డెయిరీ సంస్థకు అనుకూలంగా కొన్ని అధికారిక నిర్ణయాలు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులకు పాలు, పాల ఉత్పత్తులను సరఫరా చేసే క్రమంల.. , ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయా డెయిరీని కాదని, హరీశ్ రావుకు చెందిన ఈ ప్రైవేట్ డెయిరీల నుండి టెండర్లు లేకుండానే సరఫరా చేయడానికి మార్గం సుగమం చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనివల్ల విజయా డెయిరీ కోట్లాది రూపాయల మేర నష్టపోయిందని, ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనీ పేర్కొంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది. మరోవైపు సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు కూడా ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేశాయి. ఇటీవలే బీఆర్ఎస్ కు దూరమై టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పెట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హరీశ్ రావుకు చెందిన దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలోని భారీ ఫామ్‌హౌస్, డెయిరీ ఫామ్ పై బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 400 ఎకరాల ఫామ్‌హౌస్ వెనుక ఉన్న పెట్టుబడులు, నిధుల మూలాలు ఏమిటనే దానిపై కాంగ్రెస్ సైతం విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ విభాగాల నుండి నివేదికలు కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విజయా డెయిరీ నష్టాలు, గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన కాంట్రాక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ అండదండలతోనే మిల్చి మిల్క్ మార్కెట్లో స్వల్ప కాలంలోనే బలపడిందనే వాదనలకు, కల్వకుంట్ల కవిత విమర్శలు, రేవంత్ రెడ్డి సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు ఇచ్చిన ఆదేశాలు బలం చేకూర్చాయి. రాజకీయంగా క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరీశ్ రావుకు ఇప్పుడు ఈ డెయిరీ వివాదం మచ్చ తెచ్చి పెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి.. తెలంగాణ అవసరాలు తీరిన తరువాతే ఆంధ్రప్రదేశ్ కు జలాల విడుదల అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న హరీష్ రావు.. మిల్చీ మిల్క్ ఏపీలోని పలు బడా సంస్థలకు ముఖ్యంగా చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు ఎలా సరఫరా చేస్తున్నారంటూ కాంగ్రెస్ నిలదీయడంతో డిఫెన్స్ లో పడ్డారు. ఏపీకి జలాల విషయంలో తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీష్.. తన డైరీ ప్రోడక్ట్స్ ను మాత్రం ఏపీలోని ‘చైనా ’ చైతన్య, నారాయణ)సంస్థలు సహా బడా సంస్థలకు ఎలా సరఫరా చేస్తున్నారని కాంగ్రెస్ గట్టిగా ప్రశ్నిస్తున్నది. దీంతో పొలిటికల్ గా హరీష్ రావు డిఫెన్స్ లో పడ్డారని పరిశీలకులు చెబుతున్నారు. Harish Rao, Milchy Milk, RNS Natures Products, Kavitha on Harish Rao, Vijaya Dairy Probe, Telangana Politics
http://www.teluguone.com/news/content/milchy-milk-controversy-keep-harish-in-defence-39-225970.html





