దశాబ్దాల సమస్యకు పది నెలల్లో పరిష్కారం.. దటీజ్ లోకేష్
Publish Date:Apr 3, 2025
.webp)
Advertisement
మాట తప్పను.. మడమ తిప్పను అని పదేపదే చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఇచ్చిన ఏ మాటనూ, చేసిన ఏ వాగ్దానాన్నీ పూర్తిగా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటకు కట్టబడటం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదనిపించేలా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. విపక్షంలో ఉండగా అమరావతి రాజధానికి జై అన్న జగన్ అధికార పగ్గాలు అందుకోగానే మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. అమ్మ ఒడి, పింఛన్లు ఇలా ఒకటనేమిటి.. తన పాదయాత్ర సందర్భంగా గల్లీ కో వాగ్దానం చొప్పున చేసిన జగన్ వాటిని నెరవేర్చాలన్న విషయాన్నే పూర్తిగా మరిచారు. అధికారం అంటే కక్ష సాధింపు, దోచుకో, దాచుకో అన్నట్లుగా ఆయన పాలన సాగింది. అందుకు భిన్నంగా తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీరు ఉంది. మాట ఇచ్చానంటే నిలబెట్టుకుంటాను అని చేతల్లో చూపుతున్నారు. తండ్రి చంద్రబాబుకు తగ్గ తనయుడిగా, ఇంకా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడిగా ఆయన ఎదుగుదల సాగుతోంది.
వాస్తవానికి లోకేష్ రాజకీయాలలో తొలి అడుగు పడక ముందే వైసీపీ ఆయన నడకను ఆపేయాలని చూసంది. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు సాగించింది. రాజకీయంగా లోకేష్ అడుగులు ముందుకు పడకుండా నిలవరించడానికి నానా విథాలుగా ప్రయత్నించారు. పప్పు అన్నారు, బాడీ షేమింగ్ చేశారు. హేళనగా మాట్లాడారు. టార్గెట్ చేసి మరీ వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. అప్పట్లో రాజకీయవర్గాలలో వైసీపీ ఎందుకు లోకేష్ ను టార్గెట్ చేసుకుంది. ఆయన మాట వినబడకూడదు, ఆడుగు ముందుకు పడకూడదు అన్న ట్లుగా ఎందుకు వ్యవహరిస్తోంది అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ సందేహాలన్నిటికీ సమాధానం దొరికేసింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా లోకేష్ రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే పార్టీ కోసం, రాష్ట్ర ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్, పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకం ఇవన్నీ లోకేష్ మానస పుత్రికలే. దీంతో వైసీపీలో అప్పడే గాభరా మొదలైంది. లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికికే ప్రమాదం అన్న భయం ఏర్పడింది. దీంతో లోకేష్ టార్గెట్ గా అనుచిత విమర్శలకు తెరలేపారు. అయితే వాటిని లోకేష్ కుంగిపోలేదు. మరింత పట్టుదలతో పని చేశారు. తద్వారా తనను తాను మలచుకున్నారు. ఔను వక్రబుద్ధి నేతలు చెక్కిన శిల్పం.. పని తీరు చూడలేని కబోది నాయకుల విమర్శల నుంచి ఎదిగిన పరిణితి లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా తనలోని నాయకత్వ లక్షణాలను, పట్టుదలను, సమస్యలను దీటుగా ఎదుర్కోవడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఇప్పుడు ప్రత్యర్థులు సైతం లోకేష్ పై ప్రశంసల వర్షం కురింపిస్తున్నారంటే ఆయన తనను తాను ఎలా మలచుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు తాజాగా తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు లోకేష్. 2024 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తామని, నూతన వస్త్రాలు అందజేసి గౌరవిస్తానని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు శాశ్వత పట్టాల సమస్య నిన్నా మొన్నటిది కాదు.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్య. ఇప్పుడు ఆ సమస్యను నారా లోకేష్ కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల్లో పరిష్కరించేశారు. ప్రభుత్వ భూములలో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తానంటూ గ తఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. ముందుగా శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి ఏప్రిల్ 12 వరకు 'మన ఇల్లు.. మన లోకేష్' పేరుతో మంగళగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తొలి విడతలో మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు అందచేయనున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 4) మంగళగిరి మండలం ఎర్రబాలెం, నీరుకొండ, కాజ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి లోకేష్ తన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు, కొత్త బట్టలు అందజేస్తారు. ఈ నెల 12 వరకు వేర్వేరు గ్రామాల వారికి పట్టాలు పంపిణీ చేస్తారు. ఈ నెల 7న తాడేపల్లి మండలం ఉండవల్లి, ఇప్పటం, పెనుమాక, పద్మశాలీబజారు, కొలనుకొండ ఈ నెల 11న సీతానగరం, తాడేపల్లి సలాం సెంటర్, నులకపేట డ్రైవర్స్‌కాలనీ వాసులకు.. 12న మహానాడు-1, ఉండవల్లి కూడలి ప్రాంతాలలోని అర్హులకు పట్టాలు పంపిణీ చేస్తారు మంత్రి లోకేష్. లోకేష్ లోని ఈ చొరవ, ఈ వేగమే ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారింది. ఆయన రాజకీయ అరంగేట్రం సమయంలోనే లోకేష్ లోని ఈ ప్రజానాయకత్వ లక్షణాలను గమనించే ఆయనను అణచివేయాలని వైసీపీ కుట్రలెన్నో చేసింది. వాటన్నిటినీ అధిగమించి లోకేష్ ఇప్పుడు తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎదిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజాహృదయాలకు మరింత చేరువ అవుతున్నారు.
http://www.teluguone.com/news/content/mana-illu-mana-lokesh-39-195530.html












