టీడీపీకి అనుకూల పరిస్థితుల్లోనూ మాడుగుల తలభారం
Publish Date:Jul 18, 2022
Advertisement
పరిస్థితులు అనుకూలిస్తున్నపుడు పాత సమస్యలు వెన్నాడితే ఇబ్బందే. సమసిపోయి ఉండవచ్చని అనుకోవడమే పొరపాటు. ఇపుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం మారని గాయంగానే తయారయింది. ప్రస్తుతం రాష్ట్రంలో అంతటా అనుకూల గాలులు వీస్తుండగా మాడుగుల వర్గపోరు పరిష్కారానికి స్వయంగా రంగప్రవేశం చేయాల్సిన వస్తుంది. ఇపుడు ఎక్కడయినా సరే చిన్నపాటి విభేదాలు, వర్గపోరులు ప్రస్తుతం పార్టీకి ఉన్న అవకాశాలపై ప్రభావం చూపక పోవు. అందువల్ల మాడుగలలో మూడు వర్గాలను ఒక్కటిగా చేయాల్సిన భారం బాబు పైనే పడింది. అయితే సమస్యను అక్కడివారు తమ అధినేత, పార్టీ ప్రతిష్ట దృష్ట్యా పరిష్కరించుకుంటే బాబుకు మేలు చేసినవారే అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ 2014, 2019లోనూ టీడీపీ వర్గపోరు బయటపడటంతో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వలేక ఓడిపోయింది. ఆ రెండు పర్యాయాలు వైసీపీ తరఫున బూడి ముత్యాలనాయుడు విజయం సాధించారు. అప్పుడు టీడీపీ తరఫున పోటీచేసిన గవిరెడ్డి నాయుడు ఓడిపోయారు. ముత్యాల నాయుడు ప్రస్తుతం జగన్ మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి గవిరెడ్డి రామా నాయుడు గెలుపొందడం గమనార్హం. గవిరెడ్డి రామానాయుడు అంత కీలకంగా ఉండటం లేదని భావించిన టీడీపీ అధిష్టానం ఇటీవల పివీజీ కుమార్ కి ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించింది. గవిరెడ్డి రామానాయుడు ఆ సమయంలో ప్రతి గ్రామంలోనూ సీనియర్లను నిర్లక్ష్యం చేయడంతో వారు అసమ్మతివాదులుగా తయారై ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. 2014 ఎన్నికల్లో ఈ గ్రూపు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు నాయ కత్వంలో గవిరెడ్డి రామానాయుడిని ఓడించారని చెబుతున్నారు. ఇప్పటికీ ఈ అసమ్మతి గ్రూపు కొనసాగుతోందని ఇక్కడ ప్రచారంలో వుంది. గతంలో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా గవిరెడ్డి రామా నాయుడు ఉన్నప్పుడు ఆయన గ్రూపుతో పాటు పైలా ప్రసాదరావు గ్రూపు ఉండేది. నియోజకవర్గంలో పార్టీ కేడర్ ని ఏకం చేయడంలో గవిరెడ్డి విఫలమ య్యారని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. అప్పట్లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న పీవీజీ కుమార్ కి ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో మాడుగుల నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక గ్రూపుకు గవిరెడ్డి రామానాయుడు, రెండో గ్రూపు పీవీజీ కుమార్, మూడవ గ్రూపు పైలా ప్రసాదరావు నాయకత్వం వహిస్తు న్నారు. టీడీపీ అధిష్టానం ఆశించింది ఒకటైతే, ఇక్కడ జరిగింది మరొకటి . పార్టీలో రెండు గ్రూపులు కాస్తా మూడు గ్రూపులు కావడంతో నియోజకవర్గంలోని టీడీపీ కేడర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అంటు న్నారు. దీంతో ఏమి చెయ్యాలో అర్థంకాక టీడీపీ అధినేత చంద్రబాబు తల పట్టుకుంటున్నారని పేర్కొం టున్నారు. ఇటీవల చోడవరంలో జరిగిన అనకాపల్లి జిల్లా టీడీపీ మినీ మహానాడుకు కార్యకర్తలను తరలించడం లోనూ కుమార్ వెనుకబడ్డారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజక వర్గ సమీక్షా సమావేశంలో ఈ గ్రూపులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో వైపు ఇదే సమయంలో పైలా పౌండేషన్ చైర్మన్ పైలా ప్రసాదరావు టీడీపీకి రూ.25 లక్షలు విరాళాన్ని అంద జేశారు. ఈ నేపథ్యంలో మాడుగుల అసెంబ్లీ సీటును చంద్రబాబు వీరి ముగ్గురిలో ఎవరికి కేటాయిస్తారో అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుం టున్నారు.
http://www.teluguone.com/news/content/madugula-headach-to-tdp--39-139985.html





