లవ్లీ వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత: క్యాంపస్ భవనాలకు నిప్పు.!
Publish Date:Sep 27, 2026
Advertisement
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వదంతులు వ్యాపించాయి. ఈ తప్పుడు ప్రచారం క్షణాల వ్యవధిలో దావానలంలా వ్యాపించడంతో సుమారు 2 వేల మంది విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గర్ల్స్ హాస్టల్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన క్రమంగా తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులు ఆగ్రహంతో ఊగిపోతూ యూనివర్సిటీకి చెందిన పలు ఆస్తులను ధ్వంసం చేశారు. అంతేకాకుండా, కొన్ని భవనాల వద్ద నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. సమీపంలోని నేషనల్ హైవేను విద్యార్థులు పూర్తిగా దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ భారీ ఆందోళనపై కపుర్తలా ఎస్ఎస్పీ గౌరవ్ తూరా స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. క్యాంపస్‌లోని వ్యవసాయ విభాగం సమీపంలో నాలుగైదు రోజుల క్రితం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. అయితే, ఆ మహిళ మృతికి గానీ, వర్సిటీలో అత్యాచారం జరిగినట్లు గానీ తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అత్యాచారం జరిగిందనే వాదనలకు ఇప్పటివరకు కనీసం ఒక్క ఆధారం కూడా లభించలేదని తేల్చిచెప్పారు. పోలీసులు, వర్సిటీ అధికారులు ఎంతగా నచ్చజెప్పినా విద్యార్థులు శాంతించకపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఎల్పీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాటీ తీవ్రంగా స్పందించారు. వర్సిటీలో అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. కొందరు కావాలనే తప్పుడు, నిరాధార సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరూ కూడా ఇటువంటి వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. హైవేపై నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించారు. ప్రస్తుతం యూనివర్సిటీ యాజమాన్యం ఆందోళన చేస్తున్న విద్యార్థుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి విద్యార్థులు సంయమనం కోల్పోవద్దని అధికారులు మరోసారి హెచ్చరించారు. [ LPU Campus, Lovely Professional University, Punjab, Kapurthala, Student Protest, Viral Rumours, Social Media Rumours, Campus Violence, Student Agitation, Highway Blockade, University Protest, Gaurav Toora ]
http://www.teluguone.com/news/content/lpu-campus-25-232674.html





