కడప నేతలపై లోకేష్ కన్నెర్ర.. కారణాలేంటి?
Publish Date:Apr 8, 2026
Advertisement
నారా లోకేష్ ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-ఛార్జ్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా కడప జిల్లా ఎమ్మెల్యేలు, నేతలపై లోకేష్ సీరియస్ అయ్యారు. వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు గైర్హాజరు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు. మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరనీ, నియోజకవర్గ సమస్యలపై పట్టు కోల్పోతున్నారని లోకేష్ దగ్గర సమాచారం ఉండటంతో ఆయనపై సీరియస్ అయ్యారు. ఇటీవల పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు మహేష్ యాదవ్ డ్రగ్ టెస్టుల్లో పట్టుబడటం.. పార్టీకి మాయని మచ్చగా మారడం కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ప్రొద్దటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని నారా లోకేష్ అన్నారు.అలాగే కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటూ కూడా జనానికి అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఇటీవల ఒక ఆకస్మిక తనిఖీ చేసినా అది బూమరాంగ్ కావడంతో.. పార్టీ అధిష్టానం ఆమెపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మాధవిరెడ్డిపై వస్తున్న ఫిర్యాదులపై లోకేష్ వివరణ అడిగారని తెలుస్తున్నది. ధర్మవరం ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితర నేతలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. కొందరు నేతలు స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, ఇందువల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని లోకేష్ మందలించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సొంత వర్గాలను ప్రోత్సహించడంపైనా లోకేష్ సీరియస్ అయినట్టు సమాచారం. మైలవరం నియోజకవర్గంలోని పార్టీ అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య గల ఆధిపత్య పోరుపై లోకేష్ గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు లేదా ఇన్-ఛార్జ్‌లు ప్రజలకు అందుబాటులో లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని లోకేష్ నిష్కర్షగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి ఇచ్చే పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందన్న వార్నింగ్ కూడా లోకేష్ నుంచి వారికి వెళ్లిందని చెబుతున్నారు. ఇసుక, భూ దందాల వంటి వాటిలో ఎవరి పేరు వినిపించినా ఉపేక్షించేది లేదన్నారని చెబుతున్నారు. మొత్తానికి, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచే క్రమంలో సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదన్న సంకేతాన్ని ఈ హెచ్చరికల ద్వారా లోకేష్ ఇచ్చారని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/lokesh-lashes-out-at-kadapa-leaders-25-216976.html





