నీట్ లీక్‌పై కేటీఆర్ ఫైర్.. మేకిన్ ఇండియా కాదు.. లీకిన్ ఇండియా..!
Publish Date:Jul 24, 2026
Advertisement
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతంపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పాలక వ్యవస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, విద్యార్థి లోకంతో పెట్టుకుంటే ఎంతటి ప్రభుత్వాలైనా నేలమట్టం కాక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. తన పుట్టినరోజు వేడుకలను సైతం రద్దు చేసుకున్న కేటీఆర్, నల్ల చొక్కా ధరించి ఈ ధర్నాలో పాల్గొన్నారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ లీకేజీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ గట్టిగా డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో తమ హక్కుల కోసం ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత తరం భయపడేది కాదని, పాలకులనే వణికించే సత్తా ఉన్న నవతరం అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో విద్యార్థులు, యువత ఆగ్రహానికి గురై పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో కేంద్ర పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. విద్యార్థుల నిరసనలను అణచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తాము ధర్నా చేస్తుంటే, తమ నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ తమ విద్యార్థి రంగాన్ని ఆందోళన స్థలానికి పంపడం దారుణమని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. నీట్ బాధితులకు పూర్తిస్థాయిలో ఆమోదయోగ్యమైన న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని బీఆర్ఎస్వీ నాయకులు స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడాలని, ఈ వ్యవస్థాగత వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వేదికగా "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. కేంద్ర ప్రభుత్వ అహంకార ధోరణి నశించాలి" అంటూ విద్యార్థులతో కలిసి ఆయన గొంతుకలిపి నినాదాలు చేయడం విశేషం. విద్యార్థుల ఉద్యమానికి ఊపిరి పోస్తూ, సమాజంలో జవాబుదారీతనం తేవడానికి కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఏ విధంగానైతే ప్రాణాలకు తెగించి దీక్ష చేశారో, నేడు విద్యార్థుల ప్రయోజనాల కోసం సోనం వాంగ్‌చుక్ కూడా అదే స్థాయిలో పోరాడుతున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేటీఆర్ ఘాటైన విమర్శలు గుప్పించారు. భారతదేశ యువత ప్రపంచస్థాయిలో రాణించాలని ప్రజలు "మేకిన్ ఇండియా" కావాలని కోరితే, ప్రస్తుత పాలకులు మాత్రం ప్రశ్నాపత్రాల లీకేజీలతో "లీకిన్ ఇండియా"ను అందిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మన దేశంలో ప్రతి అంశంలోనూ యువత ఇప్పుడు పారదర్శకతను, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తోందని కేటీఆర్ తెలిపారు. రాజ్యమా ఉలిక్కిపడు.. ఈ తరం విద్యార్థులు, యువకులు చావుకు భయపడే తరం కాదు" అంటూ ఆవేశపూరితంగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు ఎన్ని రకాలుగా బెదిరించినా, చివరకు ఐటీ, ఈడీ దాడులు చేయించినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు తమ పోరాటం ఆగేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న న్యాయం దక్కే వరకు తమ మద్దతు కొనసాగుతుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. KTR NEET Protest, Dharmendra Pradhan Resignation, NEET Paper Leak Row, KTR Indira Park Protest, BRS Student Protest, NEET Scam Telangana, Dharmendra Pradhan Resignation
http://www.teluguone.com/news/content/ktr-neet-protest-36-226965.html





