సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర.. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్.!
Publish Date:Oct 14, 2026
Advertisement
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల పోరాట స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమంలో వారు పోషించిన కీలక పాత్రను కొనియాడారు. కార్మికుల చెమట చుక్కలతో దేశం వెలుగులతో నిండుతోందని వ్యాఖ్యానించారు.బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని కేటీఆర్ పేర్కొన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొని తమ ఉద్యమ స్ఫూర్తిని చాటారని గుర్తుచేశారు. కేసీఆర్ పిలుపుతో కోల్బెల్ట్ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థ అభివృద్ధి చెందిందని కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణి సహకారంతో తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని చెప్పారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.తెలంగాణకు రావాల్సిన 500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును గతంలో ఆంధ్ర ప్రాంతానికి తరలించారని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రాంతానికి తరలించారని విమర్శించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, సంస్థను ప్రైవేటీకరణ నుంచి రక్షించేందుకు కార్మికులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన కేటీఆర్.. ప్రజలు మోసపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని కేసీఆర్ గతంలోనే హెచ్చరించారని గుర్తుచేశారు. ఉత్పత్తిలోనూ, ఉద్యమాల్లోనూ సింగరేణి కార్మికులు ముందుంటారని పేర్కొంటూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. [ KTR, KTR Speech, Singareni Workers, Singareni Karmika Garjana, Singareni Workers Protest, Singareni Privatization, Revanth Reddy, Telangana Politics, BRS Party, BRS Working President KTR, Godavarikhani, Peddapalli News, Singareni Coal Mines, Telangana Movement, KCR, Congress Government Telangana ]
http://www.teluguone.com/news/content/ktr-24-234421.html




