ప్రధాని మోదీకి..కేతన్ తల్లి భావోద్వేగ లేఖ..!
Publish Date:Jul 14, 2026
Advertisement
కన్న కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఆ తల్లి గుండె, నేడు శోకసంద్రమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన 26 ఏళ్ల యువ వ్యాపారవేత్త, రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్యకు గురికావడం యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ దారుణమైన ఘటన తర్వాత అతని తల్లి రాఖీ అగర్వాల్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక అత్యంత భావోద్వేగపూరితమైన ఈమెయిల్ లేఖ రాశారు. "నా కొడుకు కేతన్ కేవలం ఒక పోలీస్ కేస్ ఫైల్‌గా మిగిలిపోకూడదు" అని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి త్వరితగతిన న్యాయం జరగాలని, నిందితులకు కఠినమైన శిక్ష పడాలని ఆమె ప్రధానిని వేడుకున్నారు. తాము ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేదా సానుభూతి కోరడం లేదని, కేవలం న్యాయం మాత్రమే కావాలని ఆ తల్లి స్పష్టం చేశారు. ఈ విషాద ఘటన 2026 జూన్ 18వ తేదీన పూణే జిల్లాలోని చారిత్రక లోహాఘడ్ కోట వద్ద జరిగింది. ప్రారంభంలో కేతన్ అగర్వాల్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించినట్లు ప్రచారం జరిగింది. కానీ, పోలీసుల లోతైన విచారణలో ఇది ప్రమాదం కాదు, అత్యంత పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ హత్య అని తేలింది. కేతన్‌తో ఈ ఏడాది నవంబర్‌లో రూ. 17 కోట్ల భారీ బడ్జెట్‌తో పెళ్లి నిశ్చయమైన అతని కాబోయే భార్య సియా గోయల్ (20) తన ప్రియుడు చేతన్ చౌదరి (22)తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. హత్యకు ముందు వీరు పూణేలోని లుల్లానగర్ ప్రాంతంలో నిందితులు క్రైమ్ రిహార్సల్స్ కూడా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ఇద్దరూ ప్రస్తుతం జూలై 16 వరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు. డిజిటల్ సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ దారుణ హత్య అగర్వాల్ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. కొడుకు మరణించిన బాధను తట్టుకోలేక, కేతన్ తాతయ్య కూడా కేవలం 20 రోజుల వ్యవధిలోనే గుండె పగిలి మరణించారు. కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో రెండు తరాల పురుషులు కన్నుమూయడం ఆ కుటుంబాన్ని నిలువునా ముంచేసింది. ఇంట్లోని ప్రతి మూల, కేతన్ గది, బట్టలు, అతని ఫోటోలు చూస్తూ ప్రతిరోజూ రాత్రి తన కొడుకుతో మాట్లాడుతున్నట్లు రాఖీ అగర్వాల్ లేఖలో కన్నీరుమున్నీరయ్యారు. అంతకుముందు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తూ ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితుడి తల్లిదండ్రులు చేస్తున్న ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రజల నుండి మద్దతు లభిస్తోంది. Ketan Agarwal murder case, Rakhi Agarwal letter PM Modi, Siya Goyal Pune, Lohagad Fort murder, Chetan Chaudhary, Pune realtor murder justice, Pune District
http://www.teluguone.com/news/content/ketan-agarwal-murder-case-36-225987.html





