జగన్ ధర్నాకు అఖిలేష్ హాజరు వెనుక కేసీఆర్!?
Publish Date:Jul 25, 2024
Advertisement
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత రాష్ట్రంలో పార్టీ ఉనికి కోసం చెమటోడుస్తూ కూడా తన మిత్రుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తన వంతు సహకారం అందిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇటు తెలంగాణలో కేసీఆర్.. అటు ఆంధ్రలో జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో స్వప్రయోజనాల పరిరక్షణ కోసం పరస్పరం ఏ విధంగా సహకరించుకున్నారో తెలిసిందే. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయం కోసం కేసీఆర్ చేయగలిగినంతా చేశారు. తెలంగాణ నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చంద్రబాబుకు ఎటువంటి సహకారం అందకుండా తన వంతు సహాయాన్ని జగన్ కు అందించారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ వెటకారపు వ్యాఖ్యలూ చేశారు. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ పాలనలో విఫలమై, తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో కూడా కేసీఆర్ తన సహకారాన్ని కొనసాగించారు. అలాగే జగన్ కూడా గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్ వద్ద హంగామాతో కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఎన్నికలలో లబ్ధి చేకూర్చడానికి జగన్ విఫలయత్నం చేశారు. సరే ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై కేసఆర్ విపక్ష నేత పాత్రకు పరిమితమయ్యారు. అది వేరే సంగతి. తెలంగాణలో బీఆర్ఎస్ పరాజయం అయినా కేసీఆర్ మాత్రం ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే తనకు ఢోకా ఉండదని భావించి, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించడం, జగన్ మళ్లీ ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ.. సార్వత్రిక ఎన్నికలకు మందు సందర్భం ఉన్నా లేకపోయినా చెబుతూ వచ్చారు. కానీ కేసీఆర్ చెప్పినట్లు జరగలేదు. ఆయన ఆశించినట్లు జగన్ సీఎం అవ్వలేదు సరికదా, ఆయన పార్టీకి కనీసం విపక్ష హోదా కూడా దక్కలేదు. తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే ఆ ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ విమర్శల గళం ఎత్తుకుందో, అదే విధంగా ఏపీలో వైసీపీ కూడా తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచీ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అంటూ గళమెత్తడం ప్రారంభించింది. అంతే కాకుండా హస్తిన వేదికగా ధర్నాకు కూడా దిగింది. వైసీపీ అధినేత జగన్ హస్తినలో నిర్వహించిన ధర్నాకు.. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ హాజరయ్యారు. నిన్న మొన్నటి దాకా బీజేపీతో అంటకాగిన జగన్ కు మద్దతుగా అఖిలేష్ రావడమేంటని రాజకీయ పండితులను సైతం విస్తుపోయారు. అయితే ఢిల్లీలో జగన్ ధర్నాకు అఖిలేష్ మద్దతు పలకడం వెనుక కేసీఆర్ హస్తం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా బీజేపీని పట్టుకు వెళాడితే లాభం లేదనీ, కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం కీలక భాగస్వామి కనుక.. జగన్ కు అక్రమాస్తుల కేసుల నుంచి రక్షణ కల్పించే విషయంలో బీజేపీ ముందుకు వచ్చే అవకాశం లేదనీ జగన్ భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ టచ్ లోకి వెడితే, వీలైతే.. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే.. ఏదో మేరకు కాంగ్రెస్ తనకు అండగా నిలుస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లడానికి జగన్ కు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అవసరమైందనీ అంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ తో తనకున్న పరిచయం ద్వారా కేసీఆర్ జగన్ ధర్నాకు హాజరు కావాల్సిందిగా కోరారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మాట తీసేయలేకే అఖిలేష్ జగన్ ధర్నాకు హాజరయ్యారంటున్నారు. అఖిలేష్ ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నందున, ఆయన ద్వారా కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లాలని కేసీఆర్ జగన్ కు సలహా ఇచ్చారంటున్నారు. అందుకే ధర్నా అయిపోయిన తరువాత కూడా జగన్ ఏపీకి రాకుండానే కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కోసం ఎదురు చూస్తూ హస్తినలోనే మకాం వేశారని అంటున్నారు. పేరుకు రాష్ట్రపతి, హోంమంత్రి అప్పాయింట్ మెంట్ కోసం అని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-behind-25-181457.html





