మియాందాద్ మాట వింటే.. అడుక్కు తినాల్సిందే..!
Publish Date:Aug 7, 2017
Advertisement
ప్రపంచ క్రికెట్‌లో అనిశ్చితికి, వివాదాలకు మారుపేరైన జట్టు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పాకిస్థాన్ అని చెప్పవచ్చు. ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్ వివాదాలు, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలు, అతిథ్య జట్టుకు భద్రతా కల్పించలేకపోవడంతో పాక్‌తో మ్యాచ్ అంటేనే ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు వేతనాలు కూడా సరిగా ఇవ్వలేకపోతోంది. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాల్సిందిగా బీసీసీఐని కోరింది పాక్. ఎందుకంటే భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఆ మజానే వేరు. మైదానం యుద్ధభూమిని తలపిస్తుంది భావోద్వేగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ పక్కనబెడితే వాణిజ్య ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం. అందుకే ఇప్పటికిప్పుడు తమ క్రికెట్‌ను రక్షించే పెద్ద దిక్కుగా టీమిండియాను చూస్తొంది పాక్. ఇరు దేశాల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌కు బీజం పడబోతుంది అనుకుంటూ ఉండగా..ఉరి సైనిక స్థావరంపై దాడి భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనికి ప్రతిగా భారత సైన్యం సర్జికల్స్ దాడులు నిర్వహించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తుందని భావించారు. అయితే ఆ తర్వాత వాతావరణం చల్లబడటంతో సిరీస్ కోసం చర్చలు ప్రారంభించింది పీసీబీ. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో బీసీసీఐపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది పాక్ క్రికెట్ బోర్డు. తమ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతామని ఒప్పందం చేసుకుని ఇప్పుడు వాటిని రద్దు చేయడం వల్ల తాము రూ.1340 కోట్లు నష్టపోయామని..దీనికి బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాలని ఐసీసీని ఆశ్రయించింది పీసీబీ. ఈ వ్యవహారం అక్కడ నడుస్తుండటం, బీసీసీఐ కూడా పాక్‌తో మ్యాచ్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్న వేళ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో సిరీస్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న భారత్‌తో పూర్తి స్థాయి సంబంధాలను తెంచుకోవాలని మియాందాద్ అన్నాడు. అంతేకాకుండా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్‌ను ఒప్పించాలని ఐసీసీ..వారు నిర్వహించే టోర్నీల్లో మాత్రం భారత్‌తో పాకిస్థాన్‌ను ఆడించాలనుకోవడం సరికాదన్నాడు. పాక్ ఎప్పుడైతే భారత్‌తో జరిగే ఐసీసీ టోర్నీలకు దూరంగా ఉంటుందో..అప్పుడు ఆ టోర్నీ ఆదరణ తగ్గుతుంది..దీంతో ఐసీసీ ఆర్థికంగా నష్టపోతుందని అప్పుడు మన విలువ ఏంటో తెలుస్తుందన్నాడు. అసలే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ క్రికెట్‌కు మియాందాద్ వ్యాఖ్యలు శరాఘాతంగా తగిలే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ విశ్వవిజేతగా ఆవతరించడంతో పాకిస్థాన్ క్రికెట్‌కు తిరిగి కొత్త జీవం వస్తుందని అంతా భావిస్తున్నారు..ప్రపంచ క్రికెట్‌లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐని కాదని ఐసీపీ ఏం చేయలేదు. అటువంటప్పుడు నయానో బయానో భారత్‌ను ఒప్పించుకోవాలి కానీ బలవంతంగా చేయగలిగింది లేదు. ఒక మాజీ కెప్టెన్‌గా, పాకిస్థానీయుడిగా మియాందాద్‌కు తమ జట్టుపై ప్రేమ ఉండటంలో తప్పు లేదు..హుందాగా వ్యవహరించాల్సిన చోట, సహనం కోల్పోతే పాక్ క్రికెట్‌కు, క్రికెటర్లకు చిక్కులు తప్పవు.
http://www.teluguone.com/news/content/javed-miandad-45-76883.html





