ఈ జపాన్ యువరాణి.. నిజమైన ‘మల్లీశ్వరి’
Publish Date:Sep 7, 2017
Advertisement
అనగనగనగా... ఓ రాకుమారి. ఏంటి? ఇదేదో... పాత సినిమా కథలా ఉంది అనుకుంటున్నారా!.. నిజమే పాత సినిమా కథే. మొన్నటి ‘పాతాళ భైరవి’ నుంచి, నిన్నటి ‘మల్లీశ్వరి’ వరకూ మనం కనిన కథే, వినిన కథే. నాడు తెరపై చూసిన ఈ పాత కథ.. నేడు కొత్త విశేషంగా మారింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ విశేషం గురించే మాట్లాడుకుంటోంది. అసలు జపాన్ యువరాణి ‘మేకో’ చేసింది సాహసం అనాలా? త్యాగం అనాలా? లేక తెగింపు అనాలా? ప్రేమ కోసం ఇంతటి త్యాగం చేస్తారా? ప్రేమలో ఇంత మాయ ఉందా? కేవలం కథల్లో మాత్రమే కనిపించే అలాంటి పాత్రలు నిజజీవితాల్లో కూడా ఉంటాయా? ఇప్పుడు అందరి మనసుల్లో ఇదే ప్రశ్న. తోటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్.. ‘కియో కొమురో’తో తన ప్రేమ వ్యవహారాన్ని తన ప్యాలెస్ లోనే స్వయంగా మీడియాకు తెలియజేసింది మేకో. త్వరలో జరుగనున్న ఎంగేజ్మెంట్ విషయం కూడా అక్కడే విశదపరచింది. సంస్థానం కట్టుబాటు ప్రకారం... రాజవంశీయులను కాకుండా.. బయటవారిని వివాహం చేసుకుంటే, సంస్థానానికి చెందిన అధికారాలన్నింటినీ పరిత్యజించాలి. 2005లో ‘మేకో’ మేనత్త విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ‘రాకుమారి మేకో’ కూడా అదే దారిలో పయనించడం జపాన్ లో చర్చనీయాంశమైంది. కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో కియో కొమురోతో స్నేహం మాత్రమే ఉండేదని.. అయితే, 2013లో ‘కియో కొమురో’.. ప్రపోజ్ చేశాడనీ, ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులూ కలవడంతో.. కియోతో జీవితం బావుంటుందనిపించిందనీ, ఒకరంటే ఒకరికి అలవిమాలిన ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మీడియాకు తెలిపారు జపాన్ యువరాణి ‘మేకో’. టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో వీరిద్దరూ అయిదేళ్లు కలిసి చదువుకున్నారు. ఇద్దరి వయసు 25 సంవత్సరాలే కావడం విశేషం. కియో కొమురో.. స్వశక్తితో ఎదిగిన వ్యక్తి. లోకల్ టూరిజం కేంపియన్లో ‘ప్రిన్స్ ఆఫ్ ది సా’గా తను ప్రసిద్ధి గాంచాడు. రేపు జరగనున్న వివాహానికి జపాన్ కి చెందిన రాజ కుటుంబాలన్నీ రానున్నాయ్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వీరి వివాహం గురించే మాట్లాడుకుంటోంది. ఇప్పటి వరకూ ‘బయట జరిగేవే సినిమాల్లో చూపిస్తారు’ అనుకునేవాళ్లం.. ఇప్పుడు ‘తెరపై జరిగేవి బయట కూడా జరుగుతాయ్’అని మనం నమ్మాలి. తప్పదు ఏమంటారు?
ఆ రాకుమారీ... ఓ సామాన్యుడి ప్రేమలో పడింది. అంతటితో ఆగిందా!... ఓ సంస్థానానికే అధినాయకురాలు కావాల్సిన ఈ అంత:పుర కాంత... ప్రేమకోసం పదవినీ, అధికారాన్ని తృణప్రాయంగా వదులుకుంది. కోరుకున్న ప్రియుడ్ని పెళ్లాడబోతూ.. ప్రపంచం మొత్తం నివ్వెపోయేలా చేసింది.
http://www.teluguone.com/news/content/japan-princess-mako-45-77620.html





