జానా చాణక్యం.. ఒక్క లేఖతో రాజగోపాల్‌కు చెక్ పెట్టే ప్రయత్నం!
Publish Date:Apr 14, 2025

Advertisement
అన్నయ్య ఆల్రెడీ మినిస్టర్. ఆయన ఎమ్మెల్యే. అయినా సరే అన్న లెక్క అన్నదే. నా లెక్క నాదే. ఇదే మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయం. అందుకే మినిస్టర్ పోస్టు కోసం గట్టిగా అడిగేస్తున్నారు. కానీ ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులెట్లా? అనేది కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ. దానికి కూడా దిమ్మతిరిగిపోయే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఒకప్పుడు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించలేదా? వాళ్లకు లేనిది ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులిస్తే తప్పా? అని కాస్త లాజికల్‌గానే అడుగుతున్నారు. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ తనకు హమీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎంత పట్టు ఉందో వేరే చెప్పక్కర్లేదు. వాళ్లు ఫోకస్ పెడితే ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిపించగలిగే సత్తా, స్థోమత ఉన్నోళ్లనే అభిప్రాయం ఉంది. వాళ్ల స్టామినా ఏమిటో తెలుసు కాబట్టే కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముందే మంత్రి పదవి కట్టబెట్టేసింది. ఇప్పుడు ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇదే వర్గానికి చెందినరాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ పోస్టు ఆశిస్తున్నారు. ఇది.. ఎప్పట్నుంచో నడుస్తున్న వ్యవహారమే.
కానీ ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి రాసిన ఓ లేఖ.. నల్గొండ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నల్గొండ జిల్లా నేత అయి ఉండి, రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పొలిటికల్‌గా జానారెడ్డి ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. ఆయన ఇద్దరు కుమారులు.. యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ఒక కుమారుడు ఎమ్మెల్యేగా, ఇంకో కొడుకు ఎంపీగా గెలిచారు. జానారెడ్డి తన కుమారుల రాజకీయ భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలివిగా చెక్ పెట్టాలని చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరికి మంత్రి పదవి ఉంది. మళ్లీ రాజగోపాల్ రెడ్డికి కూడా మినిస్టర్ పదవి దక్కితే, ఇక జిల్లాలో తన ఫ్యామిలీ రాజకీయంగా ఎదగడం కష్టమవుతుందనే ఆలోచనతోనే, జానారెడ్డి ఇలా చేశారనే చర్చ జరుగుతోంది. దానికి తగ్గట్లే 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అడిగేస్తున్నారు. తన మంత్రి పదవి విషయంలో జానారెడ్డి లాంటివాళ్లు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించడంతో, పెద్దాయన ఆ లేఖ ఎందుకు రాశారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల నుంచి మంచి మద్దతే ఉంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సపోర్ట్ రాజగోపాల్ రెడ్డికే ఉంది. వాళ్లంతా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం ఎక్కడ సంతకం చేయమన్నా చేస్తామంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వం మరింత బలపడుతుందని భావిస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ ఇప్పటికే ఈ విషయంలో జానారెడ్డి తన రాజకీయ చాణక్యం ప్రదర్శించేశారు. నల్గొండ జిల్లా నేతగా ఉండి కూడా రంగారెడ్డి జిల్లా నాయకుడికి ఓ మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాసి పొలిటికల్ హీట్ పెంచేశారు. ఇది జరిగిన తర్వాత, పార్టీలో సీనియర్ నాయకుడిగా జానారెడ్డి అన్ని జిల్లాల నేతలకు న్యాయం జరగాలనే లేఖ రాశారని అంతా అనుకున్నారు. కానీ ఆయన లెటర్ ఎందుకు రాశారో అర్థమవుతుండటంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ బెర్త్‌కు జానారెడ్డి ఒక్క లేఖతో ఎర్త్ పెట్టాలని చూస్తున్నారన్న చర్చ సాగుతోంది.
http://www.teluguone.com/news/content/janareddy-letter-raises-political-heat-in-congress-39-196209.html












