వైసీపీకి జక్కంపూడి ఫ్యామిలీ దూరం?
Publish Date:Apr 5, 2025
.webp)
Advertisement
రాజమండ్రి వైసీపీలో మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య ఆధిపత్యపోరు పోరు తార స్థాయికి చేరుకుంది. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆ పార్టీ పరువుతో పాటు నాయకుల ప్రతిష్ఠను కూడా బజారున పడేస్తున్నది . ఎవరినీ సముదాయించలేక జగన్ సైలెంట్ అవ్వడంతో జక్కంపూడి రామ్మోహనరావు వారసుడు జక్కంపూడి గణేష్ పార్టీని వీడటానికి డిసైడ్ అయ్యారంట.
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయంట. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తూర్పుగోదావరి జిల్లాలో ఆ నాయకుల మధ్య ఉన్న ఆధిపత్యపోరుకు మాత్రం తెర దించలేకపోయింది. భరత్, గణేష్‌ల టార్గెట్ ఒకటే. రాజమండ్రి వైసీపీలో తమ ఆధిపత్యం మాత్రమే ఉండాలని. ఈ ఆలోచనే రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి రామ్మోహన్‌రావు చిన్న కొడుకు జక్కంపూడి గణేష్ మధ్య రాజకీయ వైరానికి కారణమైంది.
జక్కంపూడి ఫ్యామిలీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి తూర్పుగోదావరి జిల్లాలో తెలియని రాజకీయ నాయకుడు ఉండడు. వైఎస్ సన్నిహితుడుగా జక్కంపూడి రామ్మోహన్ రావు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. జక్కంపూడి రాజకీయ వారసులుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జక్కంపూడి రాజా, ఆయన తమ్ముడు జక్కంపూడి గణేష్ లు వైఎస్, జక్కంపూడి రమ్మోహన్‌రావు మరణాల తర్వాత వైసీపీలో జగన్‌కు అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్నారు.
మరోపక్క 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మార్గాని భరత్ జగన్ అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. జగన్ ఆదేశిస్తే ఏం చేయడానికైనా రెడీ అన్నట్లు వ్యవహరిస్తుంటారు . జక్కంపూడి ఫ్యామిలీకి వైఎస్‌కు అనుబంధం ఉంటే, మార్గాని భరత్ కు వైసిపి అధినేత జగన్ కు ప్రత్యేక అనుబంధం కనిపిస్తుంది . ఒకరేమో తండ్రి వైపు నుంచి వచ్చిన వాళ్ళు ... మరొకరు తన ప్రమేయంతో వచ్చిన నేత కావడంతో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కాక జగన్ సైలెంట్ గా ఉండిపోతున్నారంట.
వైసిపి అధిష్టానం సైలెంట్ గా ఉండడమే రాజమండ్రి రాజకీయాల్లో జక్కంపూడి, మార్గాని కుటుంబాల మధ్య రాజకీయ వైరానికి కారణం అవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి
జక్కంపూడి రామ్మోహన్‌రావుకు ఆయన రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి రాజమండ్రిపై పట్టుంది. జక్కంపూడి రామ్మోహన్‌రావు మరణం తర్వాత వైసీపీ నుండి బరిలోకి దిగి రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచిన జక్కంపూడి తనయుడు రాజా పక్క నియోజకవర్గానికి వెళ్లినా ఆ ఫ్యామిలీ రాజమండ్రి పై ఫోకస్ మాత్రం తగ్గించ లేదు. జక్కంపూడి రాజా రాజానగరంపై దృష్టి పెడితే ఆయన తమ్ముడు, ప్రస్తుత ఉభయగోదావరి జిల్లాల యువజన విభాగం కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మాత్రం పూర్తి ఫోకస్ రాజమండ్రి నగరం పైనే పెడుతూ వస్తున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే గెలవడం, వైసీపీ నుండి పార్లమెంటరీ కమిటీలో మార్గాని భరత్ కు కీలకమైన పదవి రావడంతో జక్కంపూడి గణేష్, మార్గాని భరత్ లు ఎవరి ఆధిపత్యాన్ని వాళ్లు చలాయించే ప్రయత్నం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ ప్రతిపక్షాలకు పలుచనవుతూ వచ్చారు. ఒకే పార్టీలో ఉన్న మార్గాని భరత్, జక్కంపూడి గణేష్ లు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు చేసుకోవడం ఆ పార్టీ నేతలకే మింగుడుపడటం లేదంట.
మార్గాని భరత్, జక్కంపూడి గణేష్‌ల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ వైరం పరిష్కరించలేని స్థాయికి చేరుకోవడంతో జక్కంపూడి గణేష్ వైసీపీలో కొనసాగడం కష్టంగా కనిపిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి రాజకీయాల్లో మార్గాని భరత్ వల్ల వైసీపీ ప్రతిష్ట దిగజారుతున్నదని, భరత్ వ్యవహార శైలి ఇదేవిధంగా ఉంటే వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని గణేష్ అంటున్నారు. అందుకే వైసీపీని వీడటానికి నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి అధిష్టానానికి చెప్పారంట. వైసీపీని వదిలి వేయడానికి గల కారణాలు, మార్గని భరత్ వల్ల వైసీపీకి జరుగుతున్న నష్టాలను బయట పెడతానని చెపుతుండటంతో ఆ పార్టీ మరింత డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
జక్కంపూడి ఫ్యామిలీ సభ్యుడు వైసీపీని వీడనుండటంపై పార్టీలో కూడా ఇంటర్నల్ గా చర్చ మొదలైందంట. ఇప్పటికే జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న అనేకమంది నాయకులు పార్టీని వీడి వెళుతున్నారు. వైసీపీని వీడుతున్న వారిలో అత్యధికులు వైఎస్‌కు సన్నిహితంగా మెలిగిన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు జక్కంపూడి ఫ్యామిలీ నుండి మాస్ లీడర్ గా పేరున్న జక్కంపూడి గణేష్ వైసిపికి రాజీనామా చేస్తే, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రిలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా జగన్ స్పందించకపోవడమే జక్కంపూడి గణేష్ అలకకు కారణంగా చెప్తున్నారు
http://www.teluguone.com/news/content/jakkampudi-family-to-quit-ycp-39-195687.html












