కాపు సామాజికవర్గంపై జగన్ వ్యూహం.. మొదటికే మోసం.. వైసీపీలో మధనం
Publish Date:Jun 20, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. వ్యవహార శైలి, ఆయన అమలు చేస్తున్న వ్యూహాల పట్ల వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోందా? అంటే ఆ పార్టీ వర్గాల నుంచే ఔననే సమాధానం వస్తున్నది. ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజికవర్గం అంతా ఏకతాటిపైకి వచ్చి కూటమికి అండగా నిలబడటం, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడవటం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ కోసం, రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించడం కోసం కాపు సామాజికవర్గం విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ విషయంలో జగన్.. వరుసగా తప్పుడు వ్యూహాలు, నిర్ణయాలతో కాపు సమాజికవర్గాన్ని పార్టీకి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. జగన్ మోహన్ రెడ్డి కాపు సామాజికవర్గాన్నిపార్టీకి అనుకూలంగా మర్చుకోవడానికి ప్రయత్నించడం మాని, ఆ వర్గం అదే సమాజికవర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దూరం అయితే చాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారనీ, కానీ ఇది అంతిమంగా వైసీపీకి తీరని నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది. జగన్ ఈ తీరునువైసీపీలోని పలువురు సీనియర్లు ప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజికవర్గంలో అనైక్యతను పెంచడం వల్ల, వారి మధ్య చిచ్చు పెట్టడం వల్ల వైసీపీకి ఇసుమంతైనా ప్రయోజనం, రాజకీయ లబ్ధి ఉండకపోవడం అటుంచి.. అది బూమరాంగ్ అయ్యి మొత్తం కాపు సామాజికవర్గాన్నే పార్టీకి దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagans-strategy-regarding--kapu-community-backfires-39-223588.html





