జగన్ పులివెందుల కోట బద్దలు: జెండా పాతిన తెలుగుదేశం.. 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 ఏకగ్రీవం.!
Publish Date:Oct 28, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు పులివెందుల పెట్టని కోట. ఐదు దశాబ్దాలకు పైగా పులివెందులలో వైఎస్ కుటుంబానిదే హవా. వైఎస్ అనంతరం జగన్ కు పులివెందుల పెట్టని కొటగా నిలుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ కోట బద్దలైంది. స్థానిక సమరంలో పులివెందులలో వైసీపీ చతికిల పడింది. పులివెందుల గడ్డపై తెలుగుదేశం పట్టు సాధించింది. స్థానిక సమరంలో జగన్ అధినేతగా ఉన్న వైసీపీ అక్కడ కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయలేక చేతులెత్తేసింది. స్థానిక సమరంలో పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వేంపల్లి, వేముల, చక్రాయపేట, తొండూరు, సింహాద్రిపురం తదితర మండలాల్లో జరిగిన పరిణామాలు పూర్తిగా కూటమికి అనుకూలంగా మారాయి. వివిధ మండలాల్లోని స్థానిక సంస్థల స్థానాలను తెలుగుదేశం అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో పాటు, జడ్పీటీసి స్థానాల్లోనూ బలమైన ముద్ర వేశారు. దశాబ్దాలుగా ఏకపక్షంగా ఉంటూ వచ్చిన రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా పూర్తిగా రివర్స్ అయ్యాయనడానికి ఇదే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికల్లోనే పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అప్పటి నుంచీ నియోజకవర్గంలో జగన్ పట్లు, వైసీపీ బలం తగ్గుతూ వస్తోంది. తాజాగా స్థానక సమరంలో వైసీపీ కాడె వదిలేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడంలోనూ, వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలోనూ కూటమి నాయకత్వం విజయం సాధించిందంటున్నారు పరిశీలకులు. ఎన్నడూ లేనివిధంగా పులివెందుల గడ్డపై పచ్చజెండా స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను, 64 స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. అలాగే 7 జడ్పీటీసీ స్థానాలకు గాను తెలుగుదేశం మూడు స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. పులివెందులలో తెలుగుదేశం ఈ స్థాయిలో బలోపేతం అవ్వడం ఎవరి ఊహకూ అందనిది. పులివెందులలో జగన్ స్వయంగా క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, అక్కడ స్థానిక తెలుగుదేశం జోరును అడ్డుకోవడంలో విఫలమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు వస్తే, అటువంటి చోట్ల పార్టీ నాయకులకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టిక్కెట్లు ఇవ్వబోనని జగన్ గతంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు స్వయంగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో జగన్ ఇప్పుడు ఏం అంటారు? ఏం చేస్తారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది.
[Jagan Pulivendula Forte Broken, AP Local Body Elections, TDP Sweep Pulivendula, Jagan Stronghold, AP Politics, TeluguOne]
http://www.teluguone.com/news/content/jagan-pulivendula-forte-broken-39-235634.html




