జగన్ ప్రత్యేక దీక్షకి విఘ్నం
Publish Date:Sep 5, 2015
Advertisement
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ హడావుడిగా ఏదో ఒక ప్రకటన చేసేయడం వైకాపాకి అగ్నిపరీక్షగా మారిందని చెప్పుకోవచ్చును. ఆయన ఎప్పుడూ ఏదో ఒక ధర్నా లేదా బంద్ నిర్వహించబోతున్నట్లు హడావుడిగా ప్రకటించేస్తుంటారు. ఆ తరువాత పార్టీలో సీనియర్లు దానిని వాయిదా వేయడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రత్యేక హోదా కోరుతూ క్రిందటి నెల 28న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని జగన్ ప్రకటించేశారు. కానీ ఆరోజున మొదటి శ్రావణ శుక్రవారం కావడంతో బంద్ ని మర్నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించవలసి వచ్చింది. కానీ ఆ మరునాడు రాఖీ పండుగ కావడంతో మళ్ళీ ఇబ్బంది వచ్చింది. కానీ అన్నిసార్లు వాయిదా వేస్తే ప్రజలకి, అధికార పార్టీకి కూడా చులకనవుతామనే ఉద్దేశ్యంతో బలవంతంగా రాఖీ పండుగనాడే వైకాపా రాష్ట్ర బంద్ నిర్వహించింది. కానీ ఆరోజు రాఖీ పండుగ సందర్భంగా అనేక కార్యాలయాలు, దుఖాణాలు మూసి ఉండటంతో బంద్ ప్రభావం అంతగా కనబడలేదు. మళ్ళీ మొన్న శాసనసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి ఈనెల 15లోగా ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రభుత్వం సాధించకపోతే 15నుండి గుంటూరులో ఆమరణ దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు అదే సమస్య వచ్చి పడింది. ఈసారి ఆయన దీక్షకు సాక్షాత్ విఘ్నరాజు గణపతే అడ్డుపడ్డాడు. సెప్టెంబర్ 17వ తేదీన వినాయక చవితి పండుగ. ఆరోజు నుండి వరుసగా కనీసం 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. అటువంటి సమయంలో జగన్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొన్నా పట్టించుకొనేవారు ఉండరు. అటువంటి సమయంలో జనసమీకరణ చేయడం కూడా చాలా కష్టమే. కనుక ఆయన ఆమరణ దీక్షని వాయిదా వేస్తున్నట్లు వైకపా ప్రకటించింది. ఆయన మళ్ళీ దీక్షకి ఎప్పుడు కూర్చోబోతున్నారో త్వరలో ప్రకటిస్తామని వైకాపా తెలియజేసింది. వినాయక చవితి వెళ్ళగానే దసరా, ఆ తరువాత దీపావళి, క్రిస్మస్ ఇలాగ వరుసగా పండుగలు ఒకదాని తరువాత మరొకటి వచ్చేస్తాయి. ఈ పండుగ సమయంలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదలవబోతున్నాయి. కనుక ఈసారి దీక్షలు, ధర్నాలు చేస్తామని ప్రకటించే ముందు జగన్ ఓసారి పంచాంగం, సినిమా షెడ్యూల్స్ చెక్ చేసుకొని మరీ ప్రకటిస్తే ఈవిధంగా వాయిదాలు వేసుకోవలసిన అవస్థ ఎదురవదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-mohan-reddy-45-49796.html





