ట్రంప్, నెతాన్యాహూలను ఖతం చేయాలంటూ నినాదాలు.. ఎక్కడో తెలుసా?
Publish Date:Jul 5, 2026
Advertisement
అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహులను ఖతం చేయాలంటూ లక్షలమంది వీధుల్లో బహిరంగంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ జరిగింది. ఆయన అంత్యక్రియల సందర్భంగా లక్షల మంది జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఉద్రిక్తతల కారణంగా వారి అంత్యక్రియలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తరువాత.. ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఒక వారం రోజుల పాటు ఖమేనీ అంత్యక్రియల శవయాత్రను అత్యంత భారీ ఎత్తున నిర్వహించింది. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మందిరం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో లక్షలాది ప్రజలు పాల్గొన్నారు. ఈ అంత్యక్రియల సభ భారీ రాజకీయ ప్రదర్శనగా, ప్రతికార వేదికగా కనిపించింది. ఇరాన్ జాతీయ జెండాలతో పాటు, ఇస్లామిక్ సంప్రదాయంలో ప్రతికారానికి ప్రతీకగా భావించే ఎర్రజెండాలను పట్టుకుని లక్షలాది మంది జనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులను హతమార్చాలంటూ నినాదాలు చేశారు. అంత్యక్రియల వేదికపై ప్రముఖ కవి మహ్మద్ రసూలీ మాట్లాడుతూ, ఇకపై కఫనమే మా వస్త్రమని, ట్రంప్‌ను మట్టుబెట్టడం తమ పవిత్ర బాధ్యత అని పిలుపుచ్చారు. సాధారణ పౌరులు సైతం తమ ఇమామ్‌ను చంపిన ట్రంప్‌పై పగ తీర్చుకుంటామని బాహాటంగానే చెబుతున్నారు. ఇజ్రాయెల్ నుంచి తీవ్రమైన ప్రాణాపాయ బెదిరింపులు ఉన్నప్పటికీ, భద్రతా ఆంక్షలను పక్కనబెట్టి ఇరాన్ అగ్రనేతలు, మిలిటరీ కమాండర్లు సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడిగా బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్, శక్తివంతమైన కుద్స్ ఫోర్స్ అధిపతి ఇస్మాయిల్ ఖానీ, రివల్యూషనరీ గార్డ్స్ హెడ్ జనరల్ అహ్మద్ వాహిదీలతో పాటు ఖమేనీ కుమారులు మసౌద్, మేసమ్, ముస్తఫాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఖమేనీ శవపేటికతో పాటు ఆ దాడిలో మరణించిన ఆయన కోడలు జహ్రా హద్దాద్ అడెల్, కేవలం 14 నెలల వయసున్న ఆయన మనవరాలు జహ్రా మొహమ్మది గొల్పాయిగాని శవపేటికలను చూసి జనం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాన్, ఇరాక్‌లోని ప్రముఖ నగరాల్లో ఊరేగించిన అనంతరం, గురువారం ఆయన స్వస్థలమైన మషాద్‌లోని పవిత్ర ఇమామ్ రెజా బలిపీఠం వద్ద ఖననం చేయనున్నారు. Teluguone, Ali Khamenei funeral, Iran revenge, Donald Trump, Benjamin Netanyahu, Tehran protests
http://www.teluguone.com/news/content/iran-citizens-slogans-calling-for-the-elimination-of-trump-and-netanyahu-36-225132.html





