ఎరుపు, నలుపు... ఏ మట్టికుండలలో నీరు చల్లగా ఉంటుందంటే..!
Publish Date:Apr 10, 2025

Advertisement
ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకోవడంతో రాబోయే నెలల ఉష్ణోగ్రత గురించి ఆందోళన చెందుతున్నారు. చాలామంది ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి, చల్లటి నీటి కోసం తాపత్రయ పడుతుంటారు. మారుతున్న కాలంతో పాటు కూలింగ్ వాటర్ కోసం వాటర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ చాలామందికి కుండల మట్టి ప్రాధాన్యత, వాటి ఉపయోగం చాలా స్పష్టంగా అవగాహన ఉంది. అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఉన్నా సరే.. మట్టి కుండలు కొంటూ ఉంటారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు అయినా, పట్టణ ప్రాంత ప్రజలు అయినా మట్టి కుండలను కొని అందులో నీరు తాగుతుంటారు. ఎందుకంటే ఈ మట్టి కుండలు నీటిని సహజంగా చల్లబరుస్తాయి. మట్టి కుండ నీరు తాగడం వల్ల శరీరంలో ఎటువంటి కాలానుగుణ రుగ్మతలు ఏర్పడవు. కానీ మార్కెట్లో రెండు రకాల మట్టికుండలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఎరుపు రంగు కాగా.. మరొకటి నలుపు రంగు. ఏ రంగు మట్టి కుండలు ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. దీనికి సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
నలుపు రంగు కుండ..
నలుపు రంగు వేడిని త్వరగా గ్రహిస్తుంది, అందుకే నల్ల కుండలోని నీరు త్వరగా చల్లబడుతుందని నమ్ముతారు. ఇది శరీరానికి కూడా మంచిది, అందుకే ఈ కుండకు భారీ డిమాండ్ ఉంది. ఎర్ర కుండ కూడా మంచిదే అయినప్పటికీ, నల్లటి కుండతో పోలిస్తే నీరు తక్కువ చల్లగా ఉంటుంది. అయితే, ఈ రోజుల్లో మట్టి కుండలు సిమెంట్‌తో కల్తీ చేయబడుతున్నాయి కాబట్టి దానిని కొనడానికి ముందు కుండను జాగ్రత్తగా పరిశీలించాలి.
కల్తీని ఎలా గుర్తించాలి..
కుండ కొనేటప్పుడు దాని బరువును తనిఖీ చేయాలి. నిజానికి మట్టి కుండలు తేలికగా ఉంటాయి, అయితే సిమెంట్ తో చేసిన కుండలు బరువుగా ఉంటాయి. అలాగే సిమెంట్ కలిపిన కుండలోని నీరు మట్టి కుండలోని నీరు అంత మంచిది కాదు. కాబట్టి, చల్లని ఆరోగ్యకరమైన నీటి కోసం స్వచ్చమైన మట్టి కుండను ఎంచుకోవాలి.
కుండ మందం..
మట్టి కుండల షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా, మందంగా ఉండే కుండలు ఎంచుకోవాలి నిజానికి ఇది నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. సన్నని మందం ఉన్న కుండలు సులభంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కుండను కొనుగోలు చేసేటప్పుడు దాని మందంపై శ్రద్ధ వహించాలి.
లీక్ టెస్ట్..
తరచుగా ప్రజలు మట్టి కుండ కొనేటప్పుడు తొందరపాటులో లీక్ టెస్ట్ చేయడం మర్చిపోతారు. తరువాత ఇంటికి వచ్చి కుండను నీటితో నింపినప్పుడు కుండ లీకవ్వడం చూసి బాధపడతారు. కాబట్టి దుకాణంలోనే నీటిని పోసి లీక్ టెస్ట్ చేయాలి. ఎక్కడి నుంచో నీళ్లు కారుతుండటం తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ షాపుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఈ తప్పులు చేయకండి..
తరచుగా అందానికి ఆకర్షితులై, మరింత మెరిసే కుండలను కొంటారు. అయితే ఈ కుండలపై పెయింట్ వేయడం వల్ల నీరు అంత చల్లగా మారదు. కుళాయి ఉన్న కొంచెం పెద్ద కుండ కొనండి. దీనితో, కుండను పదే పదే నింపాల్సిన అవసరం ఉండదు. నీటిని బయటకు తీయడానికి దాన్ని తెరవాల్సిన అవసరం ఉండదు. ఇది నీటిని స్వచ్ఛంగా, చల్లగా ఉంచుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/in-which-earthen-pots-the-water-is-cold-35-195960.html












