ఐబొమ్మ రవికి స్వల్ప ఊరట: ఎందుకో తెలుసా.?
Publish Date:Sep 24, 2026
Advertisement
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది. పోలీసులు ఫ్రీజ్ చేసిన ఆయన బ్యాంకు ఖాతాలను లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. అదే ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేసి విడుదల చేయాలన్న విజ్ఞప్తిని మాత్రం కోర్టు అంగీకరించలేదు. సినీ పైరసీ కేసులో దర్యాప్తు సందర్భంగా ఇమంది రవికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, డిపాజిట్లపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు గతంలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆయనకు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.3 కోట్ల నిధులు ఫ్రీజ్ అయినట్లు రవి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఖాతాలు స్తంభించిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఇమ్మడి రవి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు రోజువారీ అవసరాలు, ఇతర ఖర్చులు భరించడం కూడా కష్టంగా మారిందని పేర్కొంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫ్రీజ్ చేసిన ఖాతాలను తిరిగి వినియోగించుకునే అవకాశం కల్పించాలని, అందులో నిలిచిపోయిన సుమారు రూ.3 కోట్ల మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. రవికి చెందిన బ్యాంకు ఖాతాలను లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పూర్తిగా స్తంభించిన ఖాతాలను నిర్వహించుకునే విషయంలో ఆయనకు కొంత వెసులుబాటు లభించినట్లయింది.అయితే.. ఖాతాల్లో ఇప్పటికే ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్ల నిధులపై మాత్రం కోర్టు మరో నిర్ణయం తీసుకుంది. ఆ మొత్తాన్ని అన్‌ఫ్రీజ్ చేసి రవికి అందించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఖాతాల వినియోగానికి అనుమతి వచ్చినప్పటికీ.. ఫ్రీజ్‌లో ఉన్న భారీ మొత్తాన్ని ప్రస్తుతం ఆయన వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇమ్మడి రవి ఐబొమ్మ పేరుతో నడిచిన సినిమా పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు. దర్యాప్తులో భాగంగా ఆయన బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, డిపాజిట్లపై పోలీసులు దృష్టి సారించినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి. అనంతరం ఆయనకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సమయంలో పాస్‌పోర్టు అప్పగించడం, విదేశాలకు వెళ్లకపోవడం, దర్యాప్తు అధికారికి సహకరించడం వంటి షరతులు విధించినట్లు అప్పటి నివేదికల్లో వెల్లడైంది. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం తన ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తన బ్యాంకు ఖాతాల్లో నిలిచిపోయిన సుమారు రూ.3 కోట్లను వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. తాజా ఆదేశాలతో ఖాతాల నిర్వహణకు రవికి అనుమతి లభించినప్పటికీ.. ఫ్రీజ్‌లో ఉన్న రూ.3 కోట్ల నిధులు మాత్రం విడుదల కాలేదు. దీంతో ఈ వ్యవహారంలో రవికి పాక్షికంగానే ఊరట లభించినట్లయింది. [ Ibomma Ravi, Nampally Court, Bank accounts, Cinema pheresis, Immadi Ravi, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/ibomma-ravi-24-232394.html





